కవాడిగూడ, జనవరి 30: ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 12 శాతానికి పెంచాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన తెగల వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లంబాడ, ఎరుకల, తోటి, చెంచు, గోండు, కోయ, నాయక పోడు, నక్కల తెగలకు చెందిన గిరిజన సంఘాల నేతలు రూప్సింగ్, లోకిని రాజు, ఎస్.సంజీవ్, రమణ నాయక్, వనం రమేష్, సోయం గోవర్ధన్, వనం అశోక్, ఆత్రం సాయి, ప్రకాష్, కోనేటి రాజయ్య, లోకిని సమ్మయ్య, మొగిలయ్య, ఆత్రం గోవింద్‌లు మాట్లాడారు. హైదరాబాద్‌తో పాటు యాదాద్రి, వేములవాడ పుణ్యక్షేత్రాల వద్ద గిరిజన సత్రాల నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములు, లావణి భూములకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించాలన్నారు. ఆదివాసీ గిరిజన జనాభా ప్రాతిపదికన నాలుగు నియోజక వర్గాలను కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలు గిరిజన సంఘాల నేతలు జంగేశ్వర్, సాయం ప్రభాకర్, తురాయి రాములు, కరాటే రాజు, తిరుపతి, కత్తి మల్లయ్య, ప్రకాష్ పాల్గొన్నారు.