మియాపూర్, డిసెంబర్ 3 : దేశంలోనే పెద్దదిగా.. ఐటీకి వేదికగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓటర్లు గులాబీ జెండాకే జై కొట్టారు. వందలాది ఐటీ కంపెనీలు, లక్షలాది ఉద్యోగులు.. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు నివసించే మినీ భారతావనిలో కారు తన జోరును ప్రదర్శించింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల తోడ్పాటుతో రూ.9 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి.. సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో విశ్వాసం.. నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ పట్ల ప్రజాదరణ వెరసి.. ఈ ఎన్నికలలో గాంధీకి హ్యాట్రిక్ విజయాన్నందించాయి.
తాజాగా.. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్‌పై 47వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలో సాగిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచి చివరి రౌండ్ వరకు బీఆర్ఎస్ అభ్యర్థి గాంధీ తన ఆధిక్యతను చాటుతూ వచ్చారు. తుదిగా.. భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. పెద్ద నియోజకవర్గంలో పోలింగ్ 48.85 శాతమే నమోదైనా.. అధిక మొత్తంలో ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికే పడటం విశేషం. నియోజకవర్గంలో మూడోసారి విజయం సాధించిన గాంధీకి పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. తనపై విశ్వాసంతో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజలను గుండెల్లో దాచుకుంటానని, నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
తొలి రౌండ్ నుంచి తగ్గేదేలే..
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే బీఆర్ఎస్ హవా కొనసాగింది. తొలి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీకి 6582 ఓట్లు రాగా , భాజాపా అభ్యర్థి రవికుమార్‌కు 5338 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్‌కు 4382 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్లో భాజాపా అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి గాంధీ 1244 ఓట్ల మెజార్టీ ఆధిక్యాన్ని కనబరిచారు. రెండో రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 8002, కాంగ్రెస్ అభ్యర్థికి 5736, భాజపా అభ్యర్థి 5011 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి గాంధీ 2246 ఓట్ల మెజార్టీని సాధించారు.
ఆ తరువాత భాజపా మూడో స్థానంలోకి వెళ్లింది. మూడో రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ గాంధీ తన స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. మూడో రౌండ్లో 5729 , నాలుగో రౌండ్లో 7197 , ఐదో రౌండ్లో 8490 , ఆరో రౌండ్లో 10074 , ఏడో రౌండ్లో 11,403, ఎనిమిదో రౌండ్లో 12,691, తొమ్మిదో రౌండ్లో 14, 333, పదో రౌండ్లో 17,412, పదకొండవ రౌండ్లో 18,634, పన్నెండవ రౌండ్లో 24,604, పదమూడవ రౌండ్లో 26,629, పద్నాల్గవ రౌండ్లో 24,939 , పదిహేనవ రౌండ్లో 29,947 , పదహారవ రౌండ్లో 33,793 , పదహేడవ రౌండ్లో 34,563 , పద్దెనిమిదవ రౌండ్లో 36,413 , పందొమ్మిదవ రౌండ్లో 38,148 , ఇరవైవ రౌండ్లో 38,569 , ఇరవై ఒకటవ రౌండ్లో 41,142 , ఇరవై రెండవ రౌండ్లో 44, 065, ఇరవై మూడవ రౌండ్లో 46,647 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ.. కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్ గౌడ్‌పై విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్ల ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి గాంధీ జోరు తగ్గేదేలే.. అన్న చందంగా కొనసాగి… అధిక మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్నందించింది. దీంతో ఐటీ అడ్డాలో గులాబీ జెండా మరోసారి తన సత్తా చాటినట్లయింది.
అయితే, ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలి రౌండ్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గాంధీ తన స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తొలి రౌండ్ నుంచే అసహనానికి గురైన కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్.. బీఆర్ఎస్ లీడ్ నేపథ్యంలో 11 రౌండ్లో కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. కాగా, రెండో రౌండ్ నుంచే మూడో స్థానంలో నిలుస్తూ వచ్చిన భాజాపా అభ్యర్థి రవికుమార్ కౌంటింగ్కే హాజరు కాలేదు.