సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): స్కూల్ విద్యార్థుల సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ప్రధానమైనదని, పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు పాఠశాలల యాజమాన్యాలు కూడా సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ సూచించారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్, రోడ్డు ట్రాన్స్‌పోర్టు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్‌తో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ మాట్లాడుతూ.. విద్యార్థుల సేఫ్టీతో పాటు ఐటీ సెక్టార్లో ట్రాఫిక్ రద్దీ లేకుండా చూసేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. ఇందులో స్కూల్ బస్సులను తరచూ తనిఖీలు, స్కూల్ బస్సులలో జీపీఎస్ ట్రాకింగ్‌తో పాటు అగ్ని ప్రమాద నివారణకు, ఫస్ట్ ఎయిడ్, సీటు బెల్టులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉండాలనే అంశంలోనూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు సురక్షితంగా బస్సులు ఎక్కడం, దిగడం అలవాటు చేసుకోనే విధంగా స్కూల్ యాజమాన్యాలు తరచూ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతుండాలని సూచించారు. బస్సు డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల ముందు ట్రాఫిక్ రద్దీ లేకుండా చూసుకోవాలని, స్కూల్ ఆవరణలోనే వాహనాలు పార్కింగ్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ రద్దీ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిష్ణాతులైన డ్రైవర్లను నియమించుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిని నియమించుకోవద్దన్నారు. ట్రాఫిక్‌కు సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని స్కూల్ యాజమాన్యాలకు జాయింట్ సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.