శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 : మనిషి జీవన ప్రమాణాలు పెంచేది వైద్యమని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓఎస్డీ (ఐఎఫ్‌సీ) రాజశేఖర్ చింతపల్లి అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆట), కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కాంటినెంటల్ దవాఖానలో ఏర్పాటు చేసిన హెల్త్ సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అమెరికాలో తెలుగు వారి హక్కుల కోసం పోరాడే సంస్థగా ఆట మొదటి స్థానంలో నిలుస్తున్నదన్నారు. పౌరులు ప్రాథమిక హక్కు వైద్యం, ఆరోగ్యమని ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం, దేశం ఆరోగ్యకరమైన పురోగతి సాధిస్తుందని కాంటినెంటల్ హాస్పిటల్ సీఎండీ గురు ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సెమినార్లో అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ కోశాధికారి శ్రీనీ గంగసాని, ఆంకాలజీ చీఫ్ డాక్టర్ ఏవీఎస్ సురేశ్, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయ, వివిధ వైద్య విభాగాలకు చెందిన పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.