దుండిగల్, డిసెంబర్ 18: దుండిగల్ సర్కిల్ పరిధిలోని ఓ అధికార పార్టీ యువకిశోరం టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై నోరు పారేసుకున్నట్లు తెలిసింది. దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానిక గణపతిసచ్చిదానంద ఆశ్రమం సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన భారీ షెడ్డును నామమాత్రంగా కూల్చారు. దీంతో సదరు నిర్మాణదారుడు సర్కిల్‌కు చెందిన ఓ యువనేతకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాష్ర్టానికి చెందిన ముఖ్యనేత సామాజిక వర్గానికి చెందిన మా షెడ్లపైనే చర్యలు తీసుకుంటారా? మీకెన్ని గుండెలు.. రేపటి నుంచి మీరెలా ఉద్యోగం చేస్తారో చూస్తా’..!
ఇంకోసారి మేం చెప్పిన నిర్మాణాలు (అనుమతిలేని) వైపుగాని, అక్రమ షెడ్లు వైపుగాని చూస్తే బాగుండదం’టూ టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి ఫోన్ చేసి హెచ్చరించినట్లు తెలుస్తున్నది. అన్నట్టు సదరు అధికార పార్టీ యువకిశోరం అన్నివిభాగాల అధికారుల విధుల్లో ఇటీవల వేలుపెడుతూ విధులకు అడ్డం పడుతున్నట్లు సమాచారం.అధికారులు ఏమైనా అంటే ముఖ్యనేత మనుషులం అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తున్నది.