కుత్బుల్లాపూర్: మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలో విలీనమైన విషయం తెలిసిందే. అధికారులు ఒకవైపు విలీనం అంశాలను చక్కదిద్దే క్రమంలో ఉండగా మరో వైపు ‘సందట్లో సడేమియా’లా అక్రమ నిర్మాణదారులు పనులను మరింత వేగవంతం చేశారు. కొంపల్లి జీహెచ్ఎంసీ పరిధిలో దూలపల్లి, కొంపల్లి, జయభేరి, అపర్ణఫాంగ్రో, శ్రీనివాస్‌నగర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులు తమ నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసుకునేలా రేయింబవళ్లు పాట్లు పడుతున్నారు.
ఈ అక్రమ నిర్మాణాల వెనక అధికారులే అండగా నిలుస్తున్నారని బహిరంగ చర్చసాగుతున్నది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని వచ్చే ఫిర్యాదులుంటే.. జీహెచ్ఎంసీ లో విలీనం పనులతో బిజీగా ఉన్నామంటూ సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఒకవైపు అయితే.. ఇదే సమయం అనుకూలంగా ఉండడంతో అక్రమ నిర్మాణదారులకు వంతపాడుతున్నారని బహిరంగంగా చర్చనడుస్తున్నది.
కొంపల్లిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అనేక ఫిర్యాదులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కొద్ది రోజులు పనులను నిలిపివేసిన దాఖాలాలు ఉండే. కానీ ఇప్పుడు నిలిపివేసిన అక్రమ నిర్మాణాలు యధేచ్ఛగా కొనసాగించడం పలు విమర్శలకు తావిస్తున్నది. కొంపల్లిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.