కుత్బుల్లాపూర్, ఏప్రిల్15: వేసవిలో ప్రజలకు దాహార్తిని తీర్చడంలో జలమండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్పష్టం అవుతుంది. ఇటీవల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులతో అధికారుల్లో అసహనం పెరిగిపోతుంది. ఇటీవల కుత్బుల్లాపూర్ డివిజన్ ప్రాంత ప్రజలంతా స్థానిక నేతలతో కలిసి జలమండలి కార్యాలయాన్ని సందర్శించి తమ గోడును వెళ్లబుచ్చుకునేందుకు వెళ్తే..అక్కడి నుంచి అధికారులు పరారయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన భాదితులు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
ప్రస్తుతం మరోచోట నీటి ప్రెజర్ రాకపోవడంతో పాటు వచ్చే కొద్ది పాటి నీళ్లు కూడా కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. పరిష్కరించాల్సిందిపోయి మరమ్మతులు చేయకుండా నెలరోజుల పాటు గుంతలు తవ్వి..ప్రస్తుతం ఉన్న కనెక్షన్లను తొలగించారు. వివరాల్లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వాజ్పేయ్నగర్లో చింతల్-సుచిత్ర ప్రధాన రహదిరి సమీపంలో ఉన్న పలు కుటుంబాల పరిస్థితి చూస్తే జలమండలి అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఆరు నెలలుగా గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న స్థానికులు తమ గోడును వినిపిస్తే ఉన్న కనెక్షన్‌నే తొలగించేందుకు సిబ్బంది సిద్ధపడడం ఇక్కడి అధికారుల భాద్యాతారాహిత్యానికి పరాకాష్టగా నిలుస్తోందని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలుషిత నీరే దిక్కుగా మారింది..
కుత్బుల్లాపూర్ డివిజన్ సంజీవయ్యనగర్, పద్మానగర్ ఫేస్-2, వాజ్‌పేయ్‌నగర్ కూడలి ప్రాంతాల్లోని గత ఆరు నెలలుగా మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. పైపులైన్లు లీకేజీ కావడంతో ఎప్పుడైనా నీళ్లు వచ్చినా అవి పట్టుమని పది నిమిషాలు కూడా రావడం లేదు. ఆ వచ్చే కొద్దిపాటి నీరు కూడా కలుషితంగా మారి పురుగులతో నిండి ఉండటంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు తాగి పలువురు చిన్నారులు, వృద్ధులు ఆస్పత్రుల పాలవుతున్నా తమ గోడును అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.
పరిష్కారం అడిగితే..లైన్ తొలగించేందుకు చర్యలు…
సమస్య తీవ్రమవడంతో స్థానికులు అధికారులను ఆశ్రయిస్తే అక్కడ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రదర్శించిన తీరు స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. లీకేజీలను అరికట్టి…పైపులైన్‌ను శుభ్రం చేయాల్సిన సిబ్బంది.. ఫిర్యాదు చేసిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. ఫిర్యాదుదారుల నీటి కనెక్షన్ కట్ చేసి డమ్మీ వేసి శాశ్వతంగా నీరు రాకుండా చేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకొని పనులు నిలిపివేశారు. నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేస్తే అసలు కనెక్షన్‌ను తొలగించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి ప్రెజర్ పెంచడంతో పాటు కలుషిత నీటిని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.