28 అంతస్తులు.. 28 ఫ్లాట్లు
ఒక్కోదాని విస్తీర్ణం 7,800 చదరపు అడుగులు
ధర రూ.6 కోట్ల పైమాటే
ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్‌గా మారిన మహానగరంలో ఆహా అనిపించేలా మరో భవనం రూపుదిద్దుకున్నది. ఇస్లే ఆఫ్ స్కై (ఆకాశ ద్వీపం) అని పిలువబడే ఈ భవనంలో అంతస్తుకు ఒకటి చొప్పున 28 ఫ్లాట్లు నిర్మించారు. సాధారణంగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగుల వరకు ఉంటుంది. కానీ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 1.23 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భారీ భవంతిలో ఒక్కో ఫ్లాట్ 7,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ ధర రూ.6 కోట్ల పైమాటే.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మైస్కేప్ ప్రాపర్టీస్ ఐజిల్ ఆఫ్ స్కై (ఆకాశ ద్వీపం)పేరుతో నిర్మించిన అపార్టుమెంట్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఒరవడికి నాంది పలికింది. ఈ కాంప్లెక్స్‌లో ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. పేరుకు తగ్గట్టుగానే పైనుంచి చూస్తే మబ్బుల్లో తేలియాడే ద్వీపంలానే కనిపిస్తుంది. సుమారు 1.23 ఎకరాల విస్తీర్ణంలో 28 అంతస్తులు… 28 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 7800 చదరపు అడుగులు. ధర రూ.6 కోట్ల పైమాటే. ఇదీ హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని అధునాతన ఆకాశహర్మ్యం. ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తికాగా ఇటీవలే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చింది.
ఐజిల్ ఆఫ్ స్కై ప్రత్యేకతలు
అపార్టుమెంటు ఎత్తు 105 మీటర్లు. ఫ్లాటులో ఉన్నవారు చుట్టూ 360 డిగ్రీల కోణంలో వీక్షించే అవకాశం.
7800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఒక్కో ఫ్లాట్‌లో సుమారు 250 మొక్కలను పెంచుతున్నారు. దీంతో ఆయా ఫ్లాట్లు ఒక చిట్టడవిని తలపిస్తాయి.
44/28 అడుగుల విస్తీర్ణంతో కూడిన లివింగ్, డైనింగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
28 అంతస్తులపైన … 105 మీటర్ల ఎత్తులో ఇన్ఫినిటీ పేరుతో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు.
ఒక్కో ఫ్లాటు లోపల 11.6 అడుగుల ఎత్తున స్లాబ్ ఉంటుంది.
ప్రతి అంతస్తులో ప్రైవేట్ లిఫ్ట్లాబీ ఉంటుంది.
గ్రౌండ్ ఫ్లోర్లో జాగింగ్ ట్రాక్, టెన్నిస్ కోర్టు ఉంటాయి. పెద్దలకు, పిల్లలకు ఆటస్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.