సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోందా? దాని ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చుతున్నారా? ఒక్కొక్కటిగా అధికారాలను హైడ్రాకు కట్టబెట్టేస్తున్న సర్కార్ బల్దియాను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందా? తాజాగా మాన్సూన్ ఎమర్జెన్సీ విధులను తీసుకున్న హైడ్రా దానిని సమర్థవంతంగా నడిపిస్తుందా?అంటే పౌరులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈవీడీఎం విభాగాన్ని జీహెచ్ఎంసీ నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చిన పాలకులు తాజాగా మాన్సూన్ ఎమర్జెన్సీని బల్దియా నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మీదట వర్షాకాలంలో క్యాచ్పిట్ల వద్ద చెత్తాచెదారం తొలగింపు, రహదారులు, ఇతరత్రా ప్రాంతాల్లో నిలిచిన వరద, నీటిని మోటార్ పంపులతో తొలగించడం, అవసరమైన చోట వాహనాల రాకపోకల మళ్లింపు వంటి పనులు హైడ్రా చూసుకోనుంది.
గతేడాది జూలైలో హైడ్రా ఆవిర్భావం..
హైడ్రా గతేడాది జూలై 19వ తేదీన ఏర్పాటు కాగా తెలంగాణ కోర్ అర్భన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణతో పాటు విపత్తుల నిర్వహణ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ 1955 చట్టంలోని సెక్షన్ 374 (బీ) ప్రకారం హైడ్రాకు అధికారాలు కట్టబెట్టారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో విపత్తుల నిర్వహణను చేపట్టే అధికారం కూడా హైడ్రాకు ఉంది. టీసీయూఆర్ పరిధిలో విపత్తుల నిర్వహణ, నాలాల నిర్వహణ, ట్రాఫిక్ మళ్లింపు, కూలిన చెట్లను తొలగించడం, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు, మ్యాన్‌హోళ్ల నిర్వహణ ఆయా శాఖల సమన్వయంతో చేపట్టాల్సి ఉంటుంది.
జీరో ఎక్స్పీరియన్స్…!
తాజాగా మాన్మాన్ ఎమర్జెన్సీ పనులను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించారు.. ఐతే క్షేత్రస్థాయిలో హైడ్రా ఏ మేర వరద ముంపు నివారణ చర్యలు చేపడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా హైడ్రాకి నాలాల పర్యవేక్షణ, వాటర్ లాగింగ్ పాయింట్లపై అనుభవం లేదు. లోతట్టు ప్రాంతాలపై పట్టు లేదు…అంతకు మించి ఏడాది కాలంలో వానాకాల ముంపు సమస్యల నివారణలో పెద్దగా అనుభవం లేకపోవడం ఒకవైపు.. మరోవైపు హైడ్రా వద్ద సరైన సిబ్బంది లేకపోవడం వెరసి ఈ వర్షాకాలంలో ఏ మేర సమర్థవంతమైన సేవలందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అన్నింటికంటే ప్రధానంగా కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయిసిబ్బందిని ఎలా సమన్వయం చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. 150 డివిజన్లలో కార్పొరేటర్లు, స్థానిక జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలోనే ఉండి వరద ముంపు నివారణ చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాలకు భరోసా కల్పించారు..కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రాకు ఏ మేర సహకారం అందుతుంది అనే చర్చ మొదలైంది.
సమన్వయంలో సత్తా చాటేనా..?
మాన్సూన్ వచ్చేసింది. అడపదడపా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో సర్కార్ ఉన్నఫలంగా జీహెచ్ఎంసీ నుంచి అధికారాలను హైడ్రాకు అప్పగించింది. జీహెచ్ఎంసీ పిలిచిన మాన్సూన్ ఎమర్జెన్సీ టెండర్లను రద్దుచేసి మరీ హైడ్రా చేతిలో పెట్టింది. ఐతే హైడ్రా వద్ద పటిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థ లేదు.. ఇప్పటికిప్పుడు టెండర్ పిలిచే క్యాడర్ గల ఇంజనీర్లు లేరు.. ఎస్ఈ పర్యవేక్షణలో నిర్వహణకు సంబంధించిన టెండర్‌ను ఈఈలు పిలిచి సంబంధిత ఎజెన్సీని ఎంపిక చేసి పనులు అప్పగిస్తారు..
కానీ టెండర్ ప్రక్రియను ఎలా ముగిస్తారు? క్షేత్రస్థాయిలో సరైన సిబ్బంది లేని హైడ్రా జీహెచ్ఎంసీని ఎలా సమన్వయం చేస్తుంది? క్షేత్రస్థాయి సిబ్బంది ఆ సమయంలో హైడ్రా పరిధిలో పనిచేయడానికి మొగ్గు చూపుతారా? హైడ్రా అంటేనే ఆగ్రహించిన కార్పొరేటర్లను ఏ విధంగా సమన్వయం చేస్తుంది? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 141 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లతో పాటు మరో 150 చోట్ల వరద నీరు నిలిచే ప్రాంతాలు, నాలాలు ఉప్పొంగే ఏరియాల్లో హైడ్రా సహాయక చర్యలు ఎలా ఉంటాయన్నది చర్చ నడుస్తున్నది. వర్షాలు పడుతున్న వేళ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు మేలు జరుగుతుందా? వరద కష్టాలు అధికం అవుతాయా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రానున్న రోజులలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం పట్ల జీహెచ్ఎంసీ పాలకమండలి ఏ విధంగా వ్యవహరిస్తుందో అనేది చూడాలి మరి.