టీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ): అనుకున్నట్లే జరుగుతుంది… సర్కారు అనాలోచిత నిర్ణయం సామాన్యుడికి కష్టాలు తెచ్చి పెడుతున్నది… జీవోల రూపంలో ఉన్న నిబంధనలను తోసిరాజని ఓ అనధికారిక కొత్త నిబంధనను జనం మీద రుద్దుతుండటం కొందరు అధికారులకు వరంగా మారింది. సర్కారేదో ఖజానా నింపుకొనేందుకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ఆగమేఘాల మీద హడావుడిగా చేస్తుండటంతో సందట్లో సడేమియాగా… కొందరు అధికారులు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టి పండుగ చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ తిరిగి ‘సమర్పించుకోలేక’ ఏదైతే అది కానీ అంటూ చేతులెత్తేస్తున్నారు.
అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా పట్టించుకోని ఆ ప్రక్రియను సుమారు నెల రోజుల కిందట హడావుడిగా తెర మీదకు తెచ్చింది. ఎలాగైనా గత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూఐ.3వేల కోట్లను ఖజానాకు మళ్లించుకోవాలనే లక్ష్యంతో 25 శాతం రిబేటుతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను భుజానికెత్తుకున్నది. అయితే ఈ హడావుడి తతంగంలో భారీ ఎత్తున అక్రమాలకు ఆస్కారం ఉందని ‘నమస్తే తెలంగాణ’ ముందుగానే స్పష్టం చేసింది. ముఖ్యంగా నీటి వనరుల బఫర్‌జోన్ నిర్ధారణలో దశాబ్దాలుగా జీవో 168 అమలులో ఉంది. కానీ ప్రభుత్వం ఈ హడావుడి తతంగంలో జీవోకు భిన్నంగా నీటి వనరుల చుట్టూ 200 మీటర్లు (సుమారు పావు కిలోమీటర్) దూరంలోని ప్లాట్ల క్రమబద్దీకరణపై ఆంక్షలు విధించింది.
ఈ పరిధిలోని స్థలాలకు నీటిపారుదల శాఖ నుంచి ఎన్వోసీలు తీసుకురావాలనే షరతు విధించింది. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఉండే నదుల వద్దనే బఫర్‌జోన్ అనేది గరిష్ఠంగా 50 మీటర్ల మేర ఉంది. ఇక… చెరువులు, కుంటల బఫర్‌జోన్ అనేది దాని కంటే తక్కువగా, ఆయా నీటి వనరుల విస్తీర్ణం ఆధారంగా ఉంటుంది. ఎంత పెద్ద చెరువు అయినా గరిష్ఠంగా బఫర్‌జోన్ అనేది ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్లు అంటే సుమారు వంద అడుగులు మాత్రమే ఉంటుంది. కానీ నెల రోజుల కిందట ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియలో చిన్న కుంట అయినాసరే దాని చుట్టూ 200 మీటర్లు అంటే దాదాపు 650 అడుగుల పరిధిలోని ప్లాట్లకు నీటిపారుదల శాఖ ఎన్వోసీ కావాలనే షరతు విధించింది.
గతంలో చెరువులకు అతి సమీపంలో ఉన్న వాటికి మాత్రమే నీటిపారుదల శాఖ నుంచి ఎన్వోసీ తీసుకురావాల్సి ఉండేది. కానీ ఇప్పుడు 200 మీటర్ల పరిధిలోని అన్నింటికీ అని ప్రభుత్వం కొత్త షరతు విధించడం నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు కనకవర్షాన్ని కురిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఎన్వోసీకి లక్షల్లో డిమాండు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల కిందట పటాన్చెరు డీఈ కార్యాలయంలో లక్ష రూపాయల లంచం తీసుకుంటున్న ఏఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అయితే ఇది బయటికొచ్చిన కేసు ఒకటి మాత్రమే… కానీ చాలామంది సామాన్యులు చేసేదిలేక గుట్టుగా సమర్పించుకుంటున్నవారు కొందరు. చాలామంది ఇదెక్కడి నిబంధన బాబోయ్ అంటూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎల్ఆర్ఎస్ రాయితీకి కూడా దరఖాస్తుదారుల నుంచి స్పందన కరువవడానికి ఇదో కారణంగా కూడా అధికారులు చెబుతున్నారు. కొందరైతే ఎల్ఆర్ఎస్ ఫీజు కంటే ఎన్వోసీకి అడుగుతున్న లంచమే ఎక్కువగా ఉంటుందని వాపోతుండటం గమనార్హం.
మేడ్చల్, ఏప్రిల్5(నమస్తే తెలంగాణ): అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)ద్వారా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రూ. 211 కోట్ల ఆదాయం లభించింది. జిల్లా వ్యాప్తంగా 25 శాతం రాయితీని 29 వేల మంది సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఫీజుల ద్వారా రూ. 211 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఎల్ఆర్ఎస్ను క్రమబద్ధీకరణకు 1,65 దరఖాస్తులు చేసుకున్నారు.
అయితే దరఖాస్తుల పరిశీలన అనంతరం లక్ష పైచిలుకు దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించి క్రమబద్ధీకరించే అనుమతిని ఇచ్చారు. అయితే 29 వేల మంది దరఖాస్తుదారులు మాత్రం గత నెల 31 వరకు ఫీజులు చెల్లించగా మరో 70 వేల దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం గడువు పెంచడంతో ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ద్వారా మరింత ఆదాయం చేకురే అవకాశమున్నది.