ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 22: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ-2025 ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు శనివారం ఓయూలోని డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. మొదటి ఫేజ్లో సీట్లు వచ్చినా తర్వాతి ఫేజ్లలో వారి ప్రమేయం లేకుండానే సీట్లు మారిపోయాయని మండిపడ్డారు. తర్వాతి ఫేజ్లలో ఓటీపీలు రాకపోయినా, వెబ్ఆప్షన్లు ఎంపికచేసుకోకపోయినా సీట్లు ఎలా మారాయని ప్రశ్నించారు.
ముందు వచ్చిన కళాశాలలో సీటు క్యాన్సిల్ అయిపోయి, మరో కళాశాలలో సీటు కేటాయించినట్లు విద్యార్థులకు మెసేజ్లు వస్తున్నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థిని ప్రతిష్టాత్మక కోఠి మహిళా కళాశాలలో చేరి, తరగతులకు హాజరవడంతో పాటు 20 రోజులుగా హాస్టల్ వసతి సైతం తీసుకుంటోందని చెప్పారు. అయితే ఆ విద్యార్థినికి ఆమె ప్రమేయం లేకుండానే కోఠి మహిళా కళాశాల నుంచి సైఫాబాద్ పీజీ కళాశాలకు సీటు మారినట్లు మెసేజ్ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సదరు విద్యార్థిని డైరెక్టర్ పాండురంగారెడ్డిని ప్రశ్నించగా.. విద్యార్థినికి దురుసుగా సమాధానమిచ్చారని, ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని ఉచిత సలహా సైతం ఇచ్చారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
పెద్ద ఎత్తున అక్రమాలు..!
మరో విద్యార్థికి జియాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్ రెండు కోర్సుల్లో మంచి ర్యాంకు రావడంతో మొదటి ఫేజ్లో రెండింటికి వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారని, రెండింటిలోనూ ఓయూ సైన్స్ కళాశాలలో సీట్లు వచ్చాయని చెప్పారు. ఆ విద్యార్థి జియాలజీ విభాగంలో చేరి, హాస్టల్లో సైతం చేరారని.. తరగతులకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. మొదటి ఫేజ్ అనంతరం ఆ విద్యార్థి జియో ఇన్ఫర్మేటిక్స్లో చేరలేదని సీటును రెండో విడత కౌన్సిలింగ్లో చూపెట్టలేదని చెప్పారు.
మూడో విడత కౌన్సిలింగ్ పూర్తయినప్పటికీ ఆ సీటును మొదటి విద్యార్థి పేరుపైనే చూపుతున్నారని వివరించారు. దీనివెనుక పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు తమకు అనుమానంగా ఉందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డిని సంప్రదించగా విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ప్రవేశాలు అన్నీ పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. సీట్ల బదలాయింపు అంశంపై తనకు వినతిపత్రం అందజేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.