సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమాత్యుల అండదండలు, ముడుపులు చెల్లించేవారికి ఎలాంటి చట్టాలు, నిబంధనలు వర్తించవు. అక్కడ పెద్దలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ క్రమంలోనే సస్పెన్షన్‌కు గురై, విచారణ ఎదుర్కొంటున్న ఒక వైద్యాధికారికి సస్పెన్షన్ ఎత్తివేసిన వెంటనే అత్యంత ప్రాధాన్యమైన ఎగ్జామినర్ బాధ్యతలు అప్పగించడంపై ఉస్మానియా మెడికల్ కాలేజి వైద్యవిద్యార్థులు భగ్గుమంటున్నారు. తీవ్రమైన ఆరోపణలతో దాదాపు ఆరు నెలలపాటు సస్పెన్షన్‌కు గురై, టీచింగ్‌కు దూరంగా ఉన్న వ్యక్తికి సస్పెన్షన్ ఎత్తివేసిన వెంటనే ఎగ్జామినర్‌గా ఎలా నియమిస్తారు..? పోస్టింగ్ లేకముందే సదరు అధికారి పేరును ఎగ్జామినర్ ఎంపిక కోసం యూనివర్సిటీకి ఎలా పంపించారు…? అని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
పలు రకాల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న కీలకమైన ఎగ్జామినర్ బాధ్యతను ఎలా అంటగడతారని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విచారణ ఎదుర్కొంటున్న అధికారిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ జారీచేసిన ఆదేశాల్లో తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టును కేటాయించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ విచారణ ఎదుర్కొంటున్న వైద్యాధికారిని ఎగ్జామినర్‌గా నియమించడం వెనక ఉన్న ఆంతర్యమేంటని, దీని వెనకాల పెద్ద ఎత్తున చేతులు మారివుంటాయని, ఒకవేల అదే జరిగితే ఈ పరీక్షల తరువాత తాము కూడా చేతులు తడపాల్సి వస్తుందేమోనని వైద్య విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళితే….ఆరునెలల క్రితం నిలోఫర్ హాస్పిటల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన డా.రవికుమార్ దవాఖాన ప్రాంగణంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ప్రైవేటు మెడికల్ షాపు కోసం అక్రమ నిర్మాణానికి అనుమతిచ్చారు. దీనిపై తీవ్రంగా స్పంధించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయించడంతో పాటు డా.రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే సదరు అధికారిపై దవాఖానలోని లాండరీలో వాషింగ్ మిషన్ యంత్రాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు సైతం వచ్చాయి.
కొటేషన్ ధరల కంటే రెట్టింపు ధరలకు యంత్రాలను కొనుగోలు చేశాడని, అంతేకాకుండా పాత యంత్రాలు మాయమమైనట్లు ఆరోపణలు వచ్చాయి. అంతకు ముందు ఉన్నతాధికారులకు తెలియకుండా, ఎలాంటి అనుమతి లేకుండా చిన్నపిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిపినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే డా.రవికుమార్‌పై చార్జీషీట్ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సూపరింటెండెంట్‌గా పనిచేసిన సమయంలో పీజీ విద్యార్థులను ఎన్నికల్లో వాడుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో దానిపై డీఎంఈ విచారణ జరిపించిన విషయం తెలిసిందే.
నిలోఫర్ దవాఖానలో ప్రైవేటు మెడికల్ షాపు కోసం అక్రమ నిర్మాణాలకు అనుమతించిన వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన డా.రవికుమార్‌పై ఈనెల 6న సస్పెన్షన్ ఎత్తివేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. కాని విచారణ పూర్తయ్యే వరకు డా.రవికుమార్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టింగ్ మాత్రమే కల్పించాలని సదరు ఉత్తర్వుల్లో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా స్పష్టంగా ఆదేశించారు.
దీంతో ఈనెల 6నుంచి డా.రవికుమార్ తిరిగి విధుల్లో చేరారు. కాని ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా ఈనెల 22న పేట్లబుర్జ్ దవాఖానలో ప్రొఫెసర్ ఆఫ్ పిడియాట్రిక్గా పోస్టింగ్ కల్పించారు. అయితే సస్పెన్షన్‌కు గురై, 6నెలల పాటు టీచింగ్‌కు దూరంగా ఉండి, విచారణ ఎదుర్కొంటున్న అధికారికి వెంటనే ఎగ్జామినర్ బాధ్యతలు ఎలా కట్టబెడతారని, ప్రాధాన్యత లేని పోస్టిం గ్ ఇవ్వాలంటూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా అత్యంత ప్రాధాన్యత గల ఎగ్జామినర్ బాధ్యతలను అప్పగించడంలో గల మతలబు ఏంటని వైద్యవిద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనల ప్రకారం మెడికల్ కళాశాలల్లో ఎగ్జామినర్‌గా పనిచేయాలంటే సదరు వ్యక్తి ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తూ వైద్యవిద్యార్థులకు బోదన చేస్తుండాలి. ఎగ్జామినర్‌గా ఎంపిక చేయాలంటే సీనియారిటీ ప్రకారం వైద్యాధికారి పేరును సంబంధిత విభాగాధిపతి దవాఖాన సూపరింటెండెంట్ ద్వారా వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌కు పంపాల్సి ఉంటుంది. దీనిని పరిశీలించిన ప్రిన్సిపాల్ ఆ జాబితాను హెల్త్ యూనివర్సిటీకి పంపాలి. అనంతరం యూనివర్సిటీ అధికారులు జాబితాలో పంపించిన అధికారుల పేర్లను పరిశీలించి ఎగ్జామినర్లుగా ఎంపిక చేస్తుంది. ఈ వ్యవహారం అంతా జరగాలంటే కనీసంలో కనీసం నాలుగైదు రోజుల ముందు ప్రొఫెసర్ పేరును ప్రతిపాధించి, సంబంధిత అధికారులకు పంపాల్సి ఉంటుంది. కాని ఉస్మానియా మెడికల్ కళాశాల పరిధిలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.
సస్పెన్షన్‌కు గురైన డా.రవికుమార్‌పై ఈనెల 6ననే సస్పెన్షన్ ఎత్తివేసి, 22న పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో ప్రొఫెసర్ ఆఫ్ పిడియాట్రిక్గా పోస్టింగ్ కల్పించారు. ఆ మరుసటి రోజే అంటే ఈనెల 23న డా.రవికుమార్‌ను ఎగ్జామినర్‌గా ఎలా ఎంపిక చేశారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే పోస్టింగ్ ఇవ్వకముందే ఆయన పేరును ఎగ్జామినర్‌గా ప్రతిపాధించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చార్జీషీట్ పెండింగ్‌లో ఉండి, 6నెలల పాటు టీచింగ్‌కు దూరంగాద ఉండి, పోస్టింగ్ పొందిన మరుసటి రోజే విచారణ ఎదుర్కొంటున్న అధికారికి ఎగ్జామినార్ బాధ్యతలు అప్పగించడం వైద్య విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడమేనని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పంధించి, డా.రవికుమార్‌కు ఎగ్జామినర్ బాధ్యతలు అప్పగించడంపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని ఉస్మానియా వైద్యకళాశాల విద్యార్థులు కోరుతున్నారు.