దుండిగల్, డిసెంబర్ 26 : హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో పాటు భారతదేశానికి ఇన్కాయిస్(భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం)నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమని, ప్రధాని నరేంద్రమోడీ వికసిత్ భారత్-2047 విధానానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ (మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్) శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్ అన్నారు. సునామి సంభవించి గురువారం నాటికి 20 ఏండ్లు పూర్తైన సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ సమీపంలోని ఇన్‌కాయిస్‌లో గురువారం మేధోమధనం సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రపంచంలో కనివిని ఎరుగని విపత్తుగా 2004లో సంభవించిన సునామి నిలుస్తుందన్నారు. సునామీలను అధ్యయనం చేయడానికి కేంద్రప్రభుత్వ భూ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్కాయిస్లోని సునామి ముందస్తు హెచ్చరికల కేంద్రం ప్రపంచంలోని తీరప్రాంతప్రజలకు దిక్సూచిగా మారడం గర్వకారణంగా ఉందన్నారు. సముద్రంలో సంభవించే సునామి/తుఫాన్లను ముందుగానే గుర్తించడం, సమాచారాన్ని అటు తీరప్రాంత ప్రజలకు, ప్రభుత్వాలకు సెకన్ల వ్యవధిలోనే చేరవేస్తూ ఖచ్చితమైన సమాచారం అందించడం పట్ల అభినందనలు తెలియజేశారు.
భవిష్యత్‌లోనూ మరిన్నీ మెరుగైన సేవలు అందించాలని అభిలషించడంతో పాటు ఇటువంటి కార్యక్రమాలను ఇన్కాయిస్ నిర్వహించడం ప్రధాని వికసిత్ భారత్‌కు ఉపయోగపడుతుందన్నారు. అంతకు ముందు ఆయన ఇన్కాయిస్ ఆధ్వర్యంలో సునామి ఎప్పుడు సంభవించినా ఎదరుర్కొనేందుకు సిద్ధమైన ఒడిశాలోని 26 తీరప్రాంత గ్రామాల ప్రెసిడెంట్లకు యునెస్కొ గుర్తింపు పొందిన ప్రశంసా పత్రాలు అందజేశారు. అదే విధంగా అగ్నిపర్వతాల్లో సంభవించే సునామిలను గుర్తించే ల్యాబ్‌ను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. నేవి ఏరియాలో ప్రయాణించే షిప్‌లకు సునామి సమాచారాన్ని చేరవేసే సాంకేతికతను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డా.రవిచంద్రన్, ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్, ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.కమల్‌లోచన్ మిశ్రా, ఇస్రో మాజీ డైరెక్టర్ అటామిక్ ఎనర్జీ రెగ్యూలేటర్ బోర్డుమెంబర్ డా.రాధాకృష్ణన్, ఇంటర్ గవర్నమెంట్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ విధార్ హెల్గేసన్, ఇన్కాయిస్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.