e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home హైదరాబాద్‌ ఆశచూపించి రోడ్డున పడేస్తున్నారు

ఆశచూపించి రోడ్డున పడేస్తున్నారు

ఆశచూపించి రోడ్డున పడేస్తున్నారు
  • పెట్టుబడుల పేరుతో భారీగా మోసాలు
  • ఇచ్చిన డబ్బుల వసూళ్ల కోసం గొడవలు
  • మాటామాట పెరిగి హత్యలు
  • పలువురు అజ్ఞాతంలోకి..
  • కలిసొస్తుందని నమ్మితే.. రోడ్డున పడుతున్న కుటుంబాలు

అధిక వడ్డీ, లాభాలు ఆశచూపుతూ.. పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు చేసి బిచాణా ఎత్తేస్తున్న సంఘటనలు ఇటీవల నగరంలో పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి మోసాలకు గురైన వారు కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా మరికొందరు ఏదో విధంగా డబ్బులు వసూలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులిచ్చిన వారికి, తీసుకున్న వారికి మధ్య మాటామాట పెరిగి హత్యల వరకు దారితీస్తున్నాయి. ఇదిలా ఉండగా కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోతూ కుటుంబ సభ్యులను కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. ఇటీవల సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెట్టుబడిగా పెట్టిన డబ్బులు వసూలు చేసే క్రమంలో హత్య జరిగిన విషయం విధితమే.

మ్యారేజ్‌ బ్యూరో పేరుతో..

షేక్‌ మహమూద్‌, షకీరా బేగం, మార్యం ఫాతిమా, అబ్దుల్‌ అసీఫ్‌, షేక్‌ రేష్మ జానీ బేగంలు ఏ1 మదీనా మార్యేజ్‌ బ్యూరో పేరుతో 15 శాఖలను ప్రారంభించారు. అయితే ఈ మ్యారేజ్‌ బ్యూరోలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి సుమారు 60మంది నుంచి రూ. 2.28 కోట్లు వసూలు చేశారు. హామీ మేరకు నెలవారీగా డబ్బులు ఇవ్వకపోవడంతో పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఒత్తిడి చేశారు. అయినప్పటికీ మొండికేయడంతో మ్యారేజ్‌ బ్యూరోల నిర్వాహకులు తమను మోసం చేశారని బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్‌ చేశారు.

ఆవేశం ఆపుకోలేక.. హత్య

మెడికల్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలొస్తాయంటూ కనోడియా పరిమళ్‌కుమార్‌ చెప్పడంతో కార్వాన్‌కు చెందిన మెహ్రాజ్‌బేగం నమ్మి రూ.30లక్షలు పెట్టుబడి పెట్టింది. రెండేండ్లు గడుస్తున్నా.. పరిమళ్‌కుమార్‌ లాభాలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ డబ్బులు వసూలు చేసుకునేందుకు మెహ్రాజ్‌బేగం కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. పరిమళ్‌కుమార్‌ రేపు.. మాపంటూ.. కాలం దాట వేశాడు. సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లోకాయుక్త కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో పరిమళ్‌కుమార్‌ కుటుంబం ఉంటున్నారనే విషయం తెలుసుకున్న మెహ్రజ్‌బేగం కుమారుడు ఇమ్రాన్‌ మరో నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి అక్కడకు వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లే సరికి పరిమళ్‌కుమార్‌ లేడు. దీంతో అతడి భార్య మంజూల(45) అపార్టుమెంట్‌ కిందకు వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి వారిని బయటకు తీసుకువెళ్లింది. తన భర్త ఇక్కడ ఉండటం లేదని, ఎక్కడుంటున్నాడో కూడా తెలియదని చెప్పింది. దీంతో ఇమ్రాన్‌ ఆవేశంతో ఊగిపోయాడు. కావాలనే అతన్ని దాచిపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి హతమార్చాడు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇచ్చిన డబ్బులు పోవడమే కాకుండా ఆవేశానికి గురికావడంతో ఒక నిండు ప్రాణం బలైంది. అప్పు ఇచ్చిన వాళ్లు కటకటాలపాలయ్యారు.

పెట్టుబడులు పెట్టగానే.. కార్యాలయం ఎత్తేశారు

తుర్లపాటి సతీశ్‌, గాయత్రి దంపతులు యూనిటస్‌ లైఫ్‌ సెన్స్‌ సంస్థ పేరుతో వ్యాపారం నిర్వహించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలిస్తామంటూ నమ్మిస్తూ ప్రకటించుకున్నారు. వీరి మాటలు నమ్మిన ఓల్డ్‌అల్వాల్‌ శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఇనుముల శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మధుసూదన్‌, భాస్కర శ్రీనివాస్‌, రమేశ్‌, యాహ్యాఖాన్‌తో మరికొందరు రూ.3.35 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. నమ్మకంగా కొన్నాళ్లు పెట్టుబడులపై లాభాలు ఇచ్చిన సంస్థ నిర్వాహకులు 2017, సెప్టెంబర్‌ నుంచి లాభాలు ఇవ్వడం మానేశారు. దీనిపై బాధితులు ప్రశ్నించగా ఈరోజు.. రేపు.. అంటూ కాలయాపన చేస్తూ వచ్చా రు. తర్వాత వ్యాపారులు 2018లో కాచిగూడలో ఉన్న తమ కార్యాలయాన్ని ఎత్తేశారు. దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇటీవల నిందితులిద్దరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌ పేరుతో..

లాల్‌దర్వాజ్‌ మేకల బండకు చెందిన దాసమూరి గాయత్రి, కేదారేశ్వర్‌, సందీప్‌కుమార్‌, సమంతకుమారి మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ స్థానికులు, తెలిసిన వాళ్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. తమ వద్ద సంవత్సర కాలం పెట్టుబడి పెడితే, నెలకు 5శాతం నుంచి 8శాతం వడ్డీ ఇస్తామంటూ నమ్మించారు. దీనిపై నమ్మకం కుదిరిన తరువాత తాము శివారులో భూములు కొంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నామని అందులో పెట్టుబడులు పెట్టాలంటూ ఆకర్షించారు. వీరి మాటలు నమ్మిన పలువురు రూ.1.37 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. తరువాత లాభాలు ఇవ్వకుండా, భూములు రిజిస్ట్రేషన్‌ చేయలేదు. దీంతో బాధితులు సీసీఎస్‌ పోలీసుల ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

చిట్టీల పేరుతో రూ.12.5కోట్లు

ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎ.రవిచందర్‌ యాదవ్‌ చిట్‌ఫండ్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఐదేండ్ల నుంచి చిట్టీల వ్యాపా రం నిర్వహిస్తూ స్థానికుల నమ్మకాన్ని పొందాడు. దీంతో అతని వద్ద చిట్టీలు వేసే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. కొంతకాలంగా చిట్టీ ఎత్తిన వారికి డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో చిట్‌ఫండ్‌ కార్యాలయాన్ని మూసేసి, ఇంటిని కూడా రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దీంతో బాధితులు చిట్టీల పేరుతో తమను రూ.8 కోట్ల వరకు మోసం చేశారంటూ బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా ప్తు చేపట్టగా నిందితులు మరింత మంది వద్ద కూడా డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలిసింది. సుమారు రూ.12.5 కోట్ల వరకు వసూళ్లు చేసి పరారైనట్లు తేలింది.

Advertisement
ఆశచూపించి రోడ్డున పడేస్తున్నారు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement