సిటీబ్యూరో: పోలీసుల వేధింపులతో హయత్‌నగర్‌లో కాలనీ అధ్యక్షుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అదనపు డీసీపీ నేతృత్వంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కాలనీ అధ్యక్షుడి ఆత్మహత్య కేసు దర్యాప్తు బాధ్యతలను అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. లక్ష్మీప్రియ కాలనీ అధ్యక్షుడు మధుసూదన్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వన్‌సైడ్‌గా వ్యవహరించడంతోనే మధుసూదన్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆరోపణలు వచ్చాయి.
మధుసూదన్ ఆత్మహత్యకు గల కారణాలు, పోలీసులపై ఆరోపణల్లో వాస్తవాలున్నాయా? ఇలా నిజానిజాలు బయటకు తీయాలని ఉన్నతాధికారులు భావించారు. మధుసూదన్ ఆత్మహత్య కేసు దర్యాప్తు బాధ్యతను అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డికి అప్పగించారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలు, ఇతర అంశాలన్నింటిని దర్యాప్తు చేసి నివేదిక అందించాలని అదనపు డీసీపీ కోటేశ్వర్‌రావును విచారణ అధికారిగా నియమించినట్లు ఎల్బీనగర్ డీసీపీ అనురాధ తెలిపారు.