సిటీబ్యూరో: ‘మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి. తక్కువ కాలంలో అధిక రాబడి వస్తుంది’ అంటూ అమాయకులకు ఆశ చూపి రూ.7కోట్లతో ఎగనామం పెట్టిన ఓ ఘరానా మోసగాడిని ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాద్ కథనం ప్రకారం…కాకినాడకు చెందిన విజ్జి జగదీశ్ చంద్ర ప్రసాద్ కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో నివాసముంటున్నాడు. కూకట్‌పల్లిలోని డీబీ స్టాక్ బ్రోకరింగ్ కన్సల్టెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ప్రొప్రైటర్ దీపాంకర్ బర్మన్తో కలిసి అమాయకుల నుంచి వివిధ స్కీమ్‌ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నారు. తమ కంపెనీలో ఒక సంవత్సర కాలం పెట్టుబడులు పెడితే ఏడాదికి పెట్టిన పెట్టుబడిపై 120 శాతం లాభాలు ఇస్తామని, ఆరు నెలల కాలం పెట్టుబడి పెడితే 54 శాతం, మూడు నెలల పాటు పెట్టుబడి పెడితే 24 శాతం, నెలరోజులు పెడితే 7 శాతం చొప్పున లాభాలు చెల్లిస్తామంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
రూ.7 కోట్ల వరకు పెట్టుబడుల రూపంలో వసూలు చేసిన నిందితులు లాభాలు, పెట్టుబడి రూపంలో తీసుకున్న డబ్బులను చెల్లించకుండా బిచాణా ఎత్తేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు శమాయి.. పంచాక్షర్ తమకు జరిగిన మోసంపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు జగదీశ్ చంద్రప్రసాద్ను శుక్రవారం పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు దీపాంకర్‌ను ఇటీవలే అస్సోం పోలీసులు అరెస్టు చేశారు.