Intoxication Injection | ఖైరతాబాద్, సెప్టెంబర్ 30: జిమ్ సెంటర్‌కు మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ ప్రదీప్ కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణనగర్‌కు చెందిన మహ్మద్ నయీముద్దీన్ (39) ఎలక్ట్రీషియన్. సైనిక్‌పురిలోని కందిగూడకు చెందిన నామ్‌దేవ్ మహేశ్ అలియాస్ సిద్దూ (32) రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారి. సోమవారం వీరిద్దరు కలిసి స్కూటర్‌పై వెళ్తూ.. కమ్మ సంఘం లేన్‌లోని విజయ టవర్స్ వద్ద అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని పోలీసులు ప్రశ్నించగా, తడబడ్డారు. వెంటనే వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో ఏడు ఇంజక్షన్లు, రూ.4,900 నగదు కనిపించింది.
వాటి గురించి ఆరా తీయగా, ఇన్సూలిన్ ఇంజక్షన్లు అంటూ చెప్పుకొచ్చారు. వాటి లేబుల్‌పై పెంటాజోసిన్ అని రాసి ఉంది. ఆ పేరుతో గూగుల్‌లో పరిశీలించగా, అది తీవ్రమైన నొప్పి, మత్తుకు పనిచేస్తుందని తేలింది. దీనిపై వారిని ప్రశ్నించగా, వారు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని, ఆ ఇంజక్షన్లను బంజారాహిల్స్ క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్కు అందజేశారు. అనంతరం డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమాచారమిచ్చారు. పరీక్షించిన డ్రగ్ ఇన్స్పెక్టర్.. అవి మత్తు ఇంజక్షన్లని తేల్చారు. మహ్మద్ నయీముద్దీన్‌ను విచారణ చేయగా, అతడి తండ్రి టీఎస్ఎస్పీలో రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ అని తెలిపాడు. అతడు మరణించిన తర్వాత తల్లి, సోదరితో కలిసి ఉంటున్నాడు.
యూసుఫ్‌గూడలోని పవర్ డెన్ జిమ్‌లో చేరిన సమయంలో జిమ్ ట్రైనర్ అక్కడికి వచ్చే వారితో పాటు అతడికి కూడా ఇంజక్షన్లు ఇచ్చేవాడని, దీంతో దానికి బానిసయ్యానని చెప్పాడు. ఆ ఇంజక్షన్లను శ్రీశైలంలోని సున్నీపెంటలో ఉండే ఓ మెడికల్ షాపులో తెచ్చేవాడని, వాటిని నామ్‌దేవ్ మహేశ్ అలియాస్ సిద్దూ, శైలేంద్ర లవన్ కుమార్ యాదవ్, సురేశ్ సాయి కిరణ్, నిఖిల్ యాదవ్, గణేశ్, మనీశ్ యాదవ్.. తదితరులకు సరఫరా చేసే వాడని తెలిపాడు. వినియోగదారుడైన నామ్‌దేవ్ మహేశ్‌కు అందించే క్రమంలోనే పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఇంజక్షన్లు పార్శిల్ సర్వీస్‌లో వస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.