సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో వర్చువల్ రేస్ కోర్సు… వాట్సాప్‌లో గుర్రం పందెలు నిర్వహిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడు రూ. 8.34 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కథనం ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ గుంటూర్‌కు చెందిన తొక్కల నగేశ్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం చెన్నైలో ఉద్యోగం చేస్తూ గుర్రెం పందెలకు అలవాటు పడ్డాడు. 2020లో ఆరోగ్య కారణాలతో హైదరాబాద్‌కు తన మకాం మార్చాడు. హైదరాబాద్కులో మలక్‌పేటకు చెందిన రాజేశ్‌కుమార్, ఏపీకి చెందిన వెంకట చౌదరి సహకారంతో గుర్రం పందెల బెట్టింగ్ నిర్వహించారు.
కొన్నాళ్లకు వాళ్లిద్దరి నుంచి వేరయ్యాడు. ఒంటరిగా రాజేశ్ బెట్టింగ్ దందా మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా 2024లో దమ్మైగూడలోని తిరుమల ఎన్‌క్లేవ్‌లో ఓ ఫ్లాట్ తీసుకొని అక్కడి నుంచి హార్స్ రేసింగ్‌పై బెట్టింగ్ మొదలు పెట్టాడు. షైన్వెల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో వాట్సాప్‌లో ఒక గ్రూప్ తయారు చేశాడు. అందులో వివిధ రాష్ర్టాలకు చెందిన 105 మంది అందులో గ్రూప్ సభ్యులు ఉండగా, 20 మంది జంట నగరాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వాట్సాప్‌లోనే..
నగేశ్‌కు దేశంలోని వివిధ రేస్ కోర్సుల్లో జరిగే రోజు వారీ హార్స్ రేసింగ్‌లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వస్తుంది. ఏ రోజు ఏ రేస్ ఉంది, ఆ రేస్‌లో పాల్గొనే గుర్రాలు, గెలుపు అవకాశాలున్న గుర్రాలకు సంబంధించిన సమాచారాన్ని తన గ్రూప్‌లో పెడుతాడు. ఆయా గుర్రాల గెలుపు అవకాశాలపై గ్రూప్‌లో ఉన్నవాళ్లు బెట్టింగ్ పెడుతారు. రేస్ కోర్సులో నేరుగా బెట్టింగ్ పెట్టకుండా, వాట్సాప్‌లో అవే గుర్రాలపై బెట్టింగ్ పెడుతారు, రేస్ కోర్సులో ఏ గుర్రం గెలిచిందో.. ఆ గుర్రంపై వాట్సాప్‌లో బెట్టింగ్ పెట్టిన వాళ్లకు బెట్టింగ్ హామీ మేరకు చెల్లింపులుంటాయి.
నేరుగా రేస్ కోర్సుకు వెళ్లి బెట్టింగ్ పెట్టడంతో అధికారికంగా టాక్స్‌లు చెల్లించాల్సి వస్తుంది. అయితే నగేశ్ వాట్సాప్‌లో నిర్వహించే బెట్టింగ్‌లో గెలిస్తే ఎలాంటి పన్నులుండవు. పూర్తి డబ్బు వచ్చేస్తోంది. ఇలా నగేశ్ నేరుగా రేస్కోర్సుతో ఎలాంటి సంబంధాలు లేకుండానే… తన వాట్సాప్‌నే రేస్కోర్సుగా మార్చేసి.. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. బెట్టింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు రెండు కంపెనీల పేర్లతో కరెంట్ ఖాతాలు తెరిచి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ఏడాది కాలంలో రూ. 8.34 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.
తన వద్ద బెట్టింగ్ పెడితే అధిక లాభాలు సంపాదించవచ్చంటూ తన వద్దకు వచ్చే పంటర్లను నమ్మిస్తూ హార్స్ రేస్‌లపై నిర్వాహకుడు బెట్టింగ్ పెట్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన బుకీ అయిన నగేశ్‌తో మొదట బెట్టింగ్ నిర్వహించిన ఇద్దరు బుకీలు రాజేశ్‌కుమార్, వెంకటచౌదరీ పరారీలో ఉండగా, పంటైర్లెన మణికొండకు చెందిన బొర్ర వెంకయ్య చౌదరీ, కృష్ణానగర్‌కు చెందిన చల్లా రమేశ్‌బాబు, సఫిల్‌గూడకు చెందిన డి.సునీల్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 2.47 లక్షలు ఫ్రీజ్ చేశారు. జవహర్‌నగర్ పోలీసులతో కలిసి మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ జానయ్య నేతృత్వంలోని బృందం ఈ ముఠాను అరెస్టు చేసింది.