వెంగళరావునగర్, మే 28: రాత్రి పూట చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ సొత్తును సేకరించి, విక్రయిస్తున్న మరో ఇద్దరు, సొత్తును తాకట్టు పెట్టుకుంటున్న మరొకరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జానకీ రాములు వివరాలను వెల్లడించారు. ఏపీలోని తాడిపత్రి సమీపంలో ఉన్న శ్రీరాములపేటకు చెందిన బాలగోవింద్ (22) రాత్రి వేళ తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలు చేయడంలో సిద్ధహస్తుడు. నిందితుడు పగటిపూట బస్తీల్లో చెత్త, చిత్తు కాగితాలు ఏరుకునే వాడిలా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను ఎంచుకొని, రెక్కీ నిర్వహిస్తాడు. పగటిపూట ఎంచుకున్న ఇండ్ల వద్దకు రాత్రి సమయంలో వెళ్లి.. ఆ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలు చేస్తున్నాడు. గతేడాది తాడిపత్రి టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు చోట్ల చోరీలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించాడు.
అక్కడి నుంచి రెండు నెలల కిందట హైదరాబాద్‌కు వచ్చి ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దాసారం బస్తీలో ఉంటున్నాడు. ఈ ఏడాది ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన సొత్తును దాసారం బస్తీ గుడిసెల్లోనే ఉంటున్న పి.సుంకప్ప (36), పి.సురేందర్(25)కు అప్పగించాడు. వీరు ఆ సొత్తును విక్రయించి సొమ్ము చేశారు. కొంత చోరీ సొత్తును సనత్‌నగర్‌లో పాన్ బ్రోకర్ వ్యాపారం చేస్తున్న అశోక్‌కుమార్ జైన్ వద్ద తాకట్టు పెట్టారు. ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలో జరిగిన చోరీ కేసులను దర్యాప్తు చేస్తున్న క్రైం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలగోవింద్తోపాటు సుంకప్ప, సురేందర్‌ను దాసారం బస్తీలో అరెస్టు చేశారు. చోరీ సొత్తు తాకట్టు పెట్టుకున్న అశోక్‌కుమార్ జైన్‌ను కూడా అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల విలువ చేసే 30 తులాల వెండి వస్తువులు, 2 తులాల బంగారు ఆభరణాలు రూ.2వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.