సైదాబాద్, జనవరి 19: అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా చేసే పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సౌత్ఈస్ట్ జోన్ డీపీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ అన్నారు. ఆదివారం సాయంత్రం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు జాట్ అలియాస్ రాజు ప్రస్తుతం రామగుండంలో స్థిరపడ్డాడు. స్థానికంగా ఐస్‌క్రీం వ్యాపారం చేస్తూనే మరో వైపు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. గంజాయి ఆర్డర్లు ఇచ్చిన వారి కోసం రాజు ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి తన కస్టమర్లకు అందిస్తున్నాడు.
మహారాష్ట్ర చంద్రపూర్‌కు చెందిన కస్టమర్ పురుషోత్తం ఆర్డర్ నిమిత్తం రాజు ఒడిశాకు వెళ్లి సుభాష్ వద్ద 62 కేజీల గంజాయి తీసుకొచ్చాడు. శనివారం సాయంత్రం మహారాష్ట్రకు వెళ్లేందుకుగాను కాచిగూడ రైల్వేస్టేషన్‌కు పోవడానికి నల్గొండ చౌరస్తాలో ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సౌత్ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, చాదర్‌ఘాట్ పోలీసులు విశ్వనీయ సమాచారం అందింది. దీంతో సౌత్ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, చాదర్‌ఘాట్ పోలీసులు పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తనిఖీ చేయగా.. 62 కేజీ గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనపర్చుకున్నారు.
నిందితుడు పాత నేరస్తుడని, అతడిపై వైజాగ్‌లోని అనంతగిరి, ఖమ్మం జిల్లాలోని పాల్వంచ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై, జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న ఒడిశాకు చెందిన సుభాష్, మహారాష్ట్ర చంద్రపూర్‌కు చెందిన పురుషోత్తంపై కేసు నమోదు చేశామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.15లక్షల 50వేల వరకు ఉంటుందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో సౌత్ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఆదే శ్రీనివాస్‌రావు, సౌత్ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ టి.స్వామి, ఏసీపీలు శ్యాంసుందర్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు, చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ రాజు, సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె.రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Hyd5