సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను యాద్రిది భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.17 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. భువనగిరి బస్‌స్టేషన్‌లో ఈ నెల 21వ తేదీన ఓ మహిళ దృష్టి మళ్లించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీ చేశారనే ఫిర్యాదుపై భువనగరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఈ దొంగల ముఠాపైనా కింద అసలు నోట్లు పెట్టి మధ్యలో కాగితాలతో నోట్ల కట్టలను తయారు చేసి వాటిని అసలు నోట్లుగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. మహిళలను మభ్యపెట్టి ఈ నోట్లను చూపిస్తుండగా, మరో గ్యాంగ్ వచ్చి మరో విధంగా మాట్లాడి బాధితులపై వివిధ రకాల ఒత్తిడి పెంచి వారి దృష్టి మళ్లించి వారి వద్ద ఉన్న సొమ్మును దొంగిలించి పరారవుతుంటారు. పోలీసులు ఇదంతా అంతర్రాష్ట్ర ముఠా పని అని భావించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
నగర శివారులో గుండ్లపోచంపల్లిలో గుజరాత్ రాష్ర్టానికి చెందిన గుజారాతి కిషన్ ప్లాస్టిక్ ఫ్లవర్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు అదే వ్యాపారం నిర్వహించే ఢిల్లీకి చెందిన రామ్‌లాల్, శ్యామ్‌లాల్, కోలీ, మరో జ్యువెనల్లతో పాటు గుల్షన అలియాస్ గుల్ల, దీపక్‌లతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. ఈ ముఠా బాధితుల వద్దకు వెళ్లినప్పుడు రెండుగా విడిపోతుంది. గుల్షన్, దీపక్‌లు పరారీలో ఉండగా.. మిగతా నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించడంతో భువనగిరిలో నమోదైన కేసుతోపాటు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ మరో ఏడు నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 7 బంగారు గొలుసులు 232.75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర, భవనగిరి ఏసీపీ రాహుల్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.