మన్సూరాబాద్, జూలై 24: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 లక్షల విలువైన 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ వినోద్‌కుమార్ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, కేతపల్లి మండలం, గుడివాడ గ్రామానికి చెందిన షేక్ అక్రమ్ ప్రస్తుతం నగరంలోని బోడుప్పల్, బొల్లిగూడెం, ఆర్ఎన్ఎస్ కాలనీలో నివాసముంటూ ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
బీటెక్ చదువుకున్న షేక్ అక్రమ్ బెంగళూరులో కొన్ని రోజుల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేశాడు. అనంతరం పోస్టల్ డిపార్ట్మెంట్లోనూ విధులు నిర్వహించాడు. ప్రేమ వివాహం చేసుకున్న అక్రమ్ జల్సాలకు అలవాటుపడి అప్పుల పాలయ్యాడు. గతంలో ఖమ్మం రైల్వే పోలీసులు షేక్ అక్రమ్‌ను ఎన్డీపీఎస్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాడు. జైలుకు వెళ్లి వచ్చినా అక్రమ్ బుద్ధి మారలేదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు బైక్ దొంగతనాలు చేయాలని పథకం వేసుకున్నాడు.
తన స్నేహితులైన ఏపీ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, అల్లవరం మండలం, కొమరగిరిపట్నంకు చెందిన ఈదిగ దుర్గా గంగాధర్ అలియాస్ దొరబాబు, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రవరం మండలం, వెలివెన్ను గ్రామానికి చెందిన ప్రస్తుతం అడ్డగుట్ట సొసైటీ, గాయత్రి మెన్స్ హాస్టల్లో ఉండే నీరుకొండ చరణ్‌ను సంప్రదించాడు. షేక్ అక్రమ్, ఈదిగ దుర్గా గంగాధర్‌లు పార్కు చేసిన బైకులను దొంగలించి నీరుకొండ చరణ్‌కు అప్పగిస్తారు. నీరుకొండ చరణ్ వాటిని అమ్మి.. వచ్చిన డబ్బులను ముగ్గురు పంచుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.
మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 7 బైకులను అపహరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు సమీపంలోని మాల్‌మైసమ్మ ఫ్లై ఓవర్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అటు వైపుగా బైకుపై వచ్చిన షేక్ అక్రమ్, దుర్గా గంగాధర్, నీరుకొండ చరణ్ అనుమానాస్పదంగా కనిపించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బైకు దొంగతనాల విషయం బయటపడింది. నిందితుల నుంచి 9 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు, ఒక యూనికార్న్ బైకు, ఒక పల్సర్ బైకు మొత్తం 11 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైకు దొంగతనాల కేసులో నిందితులైన షేక్ అక్రమ్, దుర్గా గంగాధర్, నీరుకొండ చరణ్‌ను రిమాండ్‌కు తరలించారు.