బేగంపేట్, జూన్ 14: రక్తదానంపై యువకుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కిమ్స్ ఆసుపత్రి గ్రూప్ చైర్మన్, ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం నిర్వహించారు. ఈ మేరకు ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ… ఇటీవల పెరుగుతున్న రక్తం అవసరాల రీత్యా.. సరిపడా రక్తం అందుబాటులో లేకపోడవంతో అనేక ఇబ్బందులకు దారి తీస్తుందన్నారు.
కిమ్స్ ఆసుపత్రిలో గణాంకాలు పరిశీలిస్తే 30 నుంచి 50 ఏండ్ల వరకు ఉన్న వారు రక్తదానం చేస్తున్నట్టు తేలిందన్నారు. కానీ 18 నుంచి 30 ఏండ్లు ఉన్న యువకులు రక్తదానం చేసేందుకు రావడం లేదని, వారు ముందుకు రావాలని సూచించారు. రక్తదానంపై అపోహలు ఉండటం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. రక్తదానంపై యువతకు అవగాహన అవసరమని బ్లడ్‌బ్యాంక్ విభాగాధిపతి డాక్టర్ కీర్తి పేర్కొన్నారు. ఇందు కోసం కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు.