సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబర్తిల మధ్య అంతర్గత కోల్డ్‌వార్ కొనసాగుతున్నది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కమిషనర్‌పై మేయర్ ఇటీవల ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం మేయర్ ఇలంబర్తి వ్యవహారాన్ని తీసుకెళ్లినట్లు మేయర్ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా స్టాండింగ్ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు పలు డివిజన్లలో మేయర్ పర్యటిస్తున్నారు.
శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ముషీరాబాద్ తదితర నియోజకవర్గాల్లో పలు డివిజన్లలో మేయర్ పర్యటించి.. స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు ఒక రోజు ముందుగానే కమిషనర్‌కు మేయర్ కార్యాలయం సమాచారం చేరవేరుస్తుంది. అయితే మేయర్ వరుసగా చేపట్టిన ఐదు పర్యటనల్లో కమిషనర్ పాల్గొనలేదు.
కనీసం మేయర్ ఫోన్ చేసినా.. స్పందించడం లేదని మేయర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. క్షణం తీరిక లేకుండా జూమ్ మీటింగ్‌లు, సమావేశాలు ఉండటంతో మేయర్ పర్యటనలో కమిషనర్ వెళ్లడం సాధ్యపడలేదని, జోనల్ కమిషనర్లు, కింది స్థాయి అధికారులు మేయర్ పర్యటనలో ఉంటున్నారని కమిషనర్ కార్యాలయ వర్గాలు స్పష్టత ఇస్తున్నాయి. మొత్తంగా ఈ ఇద్దరి మధ్య నెలకొన్న అంతర్గత వార్ ప్రజా సమస్యలపై ప్రభావం పడకముందే సమన్వయంతో హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాడాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్నిరోజులుగా కమిషనర్ ఇలంబర్తి వ్యవహార శైలి వివాదాస్పదమవుతూనే ఉంది. మేయర్, కార్పొరేటర్లను ఏమాత్రం పట్టించుకోకుండా కమిషనర్ అంతా తానై అన్నట్లు నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. స్టాండింగ్ కమిటీ ప్రతి వారం జరగడం లేదు. ఏజెండాలు లేవన్న సాకుతో వాయిదాలు పడుతూ వస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సైతం ఆలస్యమైందని సభ్యులు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా కమిషనర్ ఇలంబర్తి కార్పొరేటర్లకు సమయం ఇవ్వడం లేదని, డివిజన్లలో చాలా సమస్యలు పెరిగిపోతున్నా.. ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని, క్షేత్రస్థాయిలో అధికారులు కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు.