సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ ) :నిన్నటి దాకా అది నిరూపయోగంగా ఉన్న స్థలం. కానీ నేడు అదే స్థలం విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రంగా మారింది. గ్రేటర్లో తొలిసారిగా ఐటీ కారిడార్‌లో ‘ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు’గా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్శిటీ విభాగం తీర్చిదిద్దింది. నగర వాసులకు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను పెంపొందించడం పట్టణ పారుల ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ విభిన్న పద్ధతుల్లో వైవిద్యమైన థీమ్ పార్కులను విడతల వారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఆరోగ్యమే పరమావధిగా వచ్చిన థీమ్ పార్కులకు నగర వాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. 12,89,337 చదరపు గజాల్లో 56 థీమ్ పార్లకు శ్రీకారం చుట్టగా.. ఇందులో ఇప్పటికే 20 చోట్ల స్పోర్ట్స్ పార్, తెలంగాణ స్ఫూర్తి పార్, మల్టీ జనరేషన్ పార్, ఉమెన్ థీమ్ పార్ ఇలా ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని సైబర్ టవర్స్ సమీపంలో పత్రికానగర్‌లో దాదాపు 1.25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.2కోట్ల వ్యయంతో ‘ ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు’ను తీర్చిదిద్దారు.
విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేలా ప్రత్యేకతలతో ఈ సైన్స్ పార్కును సిద్ధం చేశారు. వైఫై సౌకర్యం, ల్యాప్‌టాప్‌తో పనిచేసుకునేలా సీటింగ్ సౌకర్యం, చార్జింగ్ పాయింట్లు, కనువిందు చేసేలా విభిన్నమైన ఆకృతులు తదితర ఆకట్టుకునేలా ఈ పార్కును ఏర్పాటు చేశారు. విజ్ఞాన శాస్త్ర భావాలను నేర్చుకోవడమే కాకుండా పార్కులో అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను అందించేలా తీర్చిద్దిదారు. సైన్స్ పార్కులో ఓపెన్ జిమ్‌తో పాటు పిల్లలకు ప్రత్యేకంగా ఆట స్థలం ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ర్యాంప్‌లు, నడక మార్గాలు ఏర్పాటు చేశారు. సేద తీరేలా గెజిబోలు, సొగసైన సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఎటూ చూసినా.. పచ్చదనం, పార్కు చుట్టూ ఐటీ కంపెనీలు, హాస్టళ్లు, గెస్ట్ హౌజ్‌లు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు ఉండటంతో పాటు ప్రత్యేకంగా హాస్టళ్లలో ఎక్కువగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వీలుగా ఈ పార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. ఈ పార్కును త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నామని అధికారులు తెలిపారు.