సిటీబ్యూరో, మార్చి 4 ( నమస్తే తెలంగాణ ) : నేటి నుంచి ఈనెల 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 244 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి ఒడ్డెన్న తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 401 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, ఇతర కాలేజీల్లో మొత్తం 1,59,180 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
వీరిలో మొదటి సంవత్సరం 78,100, సెకండ్ ఇయర్ 81,080 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా 6,367 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. ప్రతి సెంటర్లో ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారి డ్యూటీలో ఉంటారు. 244 చీఫ్ సూపరింటెండెంట్లు, 244 డిపార్టుమెంట్ ఆఫీసర్లు, 10 సిట్టింగ్ స్క్వాడ్స్, 5 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, హై పవర్ కమిటీలు, జిల్లా పరీక్షల విభాగం కమిటీలు పరీక్షల నిర్వహణను పరీక్షిస్తారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష హాల్ల్లోకి అనుమతిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంటుంది. పరీక్ష జరిగే సమయాల్లో స్థానికంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రంలో తాగునీరు, ఏఎన్ఎం, ఆశ వర్కర్ అందుబాటులో ఉంటారు. ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష కేంద్రం లొకేషన్ తెలుసుకునేందుకు ప్లేస్టోర్లో లొకేషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉంది అనే వివరాలు తెలుసుకోవచ్చని ఒడ్డన్న తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళనకు ఒత్తిడికి గురైతే పరిష్కారం కోసం టెలీమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14418 లేదా 1800914416ను సంప్రదించి కౌన్సెలింగ్ సేవలను పొందొచ్చని ఆయన పేర్కొన్నారు.
7గంటల నుంచి బస్సు సేవలు
సిటీబ్యూరో, మార్చి 4 ( నమస్తే తెలంగాణ ) : ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా బస్సు సేవలను పెంచినట్టు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత మార్గాల్లో బస్సులు ఆలస్యంగా ఉంటే తక్షణమే 9959226161, 99 59226154 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 4 గం టల వరకు ప్రత్యేక సిబ్బంది బస్సు సేవలపై పర్యవేక్షిస్తారని వివరించారు.