సిటీబ్యూరో, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో బుధవారం నుంచి జరుగబోయే ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 1,74,784 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 80,583, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 93,784 మంది ఉన్నారు. జిల్లాలో 242 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారిని నియమించారు. మాల్ ప్రాక్టీస్ జరుగకుండా 4 ఫ్లయింగ్ స్కాడ్, 10 సిట్టింగ్ స్కాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ప్రశ్నాపత్రం తీసే ప్రిన్సిపల్ గదిలో, సెంటర్ ఎంట్రన్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కరెంట్, అస్వస్థత ఇబ్బందులు తలెత్తకుండా ఏఎన్ఎం, విద్యుత్ సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. విద్యార్థులు వారి సెంటర్లను సులువుగా చేరుకునేందుకు ఇంటర్ బోర్డు వారు సెంటర్ లొకేటర్ యాప్ ప్రవేశపెట్టారు. అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు 14416 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు చేరుకునేందుకు ట్రై కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ రద్దీ ఉండకుండా చూసేలా అప్రమత్తమయ్యారు. మరో వైపు ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు చెప్పారు. బస్సుల రాకపోకల్లో ఆలస్యమైతే కోఠి-9959226160, రేతిఫైల్-9959226154 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారమివ్వాలని కోరారు. పరీక్ష రాసే అబ్బాయిలు రాయితీ బస్ పాస్, హాల్టికెట్ చూపిస్తే ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చని తెలిపారు.