హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ): బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కొనుగోలుకు నగరవాసులు అమితాసక్తి చూపుతున్నారు. నాగోలు బండ్లగూడ ప్రాజెక్టులోని 159 ఫ్లాట్ల కొనుగోలుకు సంబంధించిన దరఖాస్తు చేసుకేనేందుకు మంగళవారం చివరి రోజు కాగా, మొత్తంగా 1900 దరఖాస్తులొచ్చాయి. ఇందులో చివరి రోజైన మంగళవారం 600కు పైగా దరఖాస్తులు రావడం విశేషం.
సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారి నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి లబ్ధిదారులు తమకు నచ్చిన ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఒకే ఫ్లాట్ కోసం ఎక్కువ మంది పోటీ పడితే జూలై 30(బుధవారం)న బండ్లగూడ ప్రాజెక్టు కార్యాలయంలో లాటరీ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయనున్నారు.
రసీదు ఉంటే చాలు, ఇక్కడ రాకుంటే అక్కడ..
బండ్లగూడలో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకుని లాటరీలో ఫ్లాట్ దక్కనివారు పోచారం ప్రాజెక్టులోని ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. బండ్లగూడ ప్రాజెక్టులో ఈఎండీ చెల్లించినట్లు ఇచ్చిన రశీదును పోచారం ప్రాజెక్టులో సమర్పించి అకడి ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్గూడా ప్రాంతాల్లోని ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగే ఓపెన్ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలం పాటలో పాల్గొనడానికి , బండ్లగూడలో పొందిన రశీదుతోనే పాల్గొనవచ్చన్నారు.
పోచారం ప్రాజెక్టు దరఖాస్తుకు చివరి తేదీ 31
ఘట్కేసర్ పోచారం ప్రాంతంలోని 601 ఫ్లాట్ల విక్రయానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఈనెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. పోచారం ప్రాంతంలో సింగిల్ బెడ్రూం ఫ్లాట్ ధర రూ.13లక్షలు కాగా, 2 బీహెచ్‌కే రూ.19 లక్షల్లో అందుబాటులో ఉన్నది. అన్ని సదుపాయాలతో, కబోర్డులతో నిర్మితమై, కొనుగోలు ప్రక్రియ పూర్తి కాగానే గృహ ప్రవేశం చేసుకోడానికి(రెడీ టు ఆక్యుపై) సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫ్లాట్ల కొనుగోలు కోసం దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూలై 31. కాగా, లాటరీ ప్రక్రియ ఆగస్టు 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎండీ వీపీ గౌతం విజ్ఞప్తి చేశారు.