గోల్నాక, ఫిబ్రవరి 22: సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, అది దృష్టిలో ఉంచుకొని శిక్షణ పొందుతూ ఉత్తమ పోలీస్‌గా ఎదగాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఐజీ బి.శివధర్ రెడ్డి సూచించారు. గురువారం అంబర్‌పేట పోలీస్ శిక్షణ కేంద్రం (పీటీసీ)లో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణా శిబిరాన్ని ఆయన పీటీసీ ప్రిన్సిపాల్ మధుకర్ స్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో రోజు రోజుకూ విభిన్న నేరాలు చోటు చేసుకుంటూ.. పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయన్నారు.
వాటిని అధిగమించేలా శిక్షణ పొందాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించేలా పోలీసుల విధులు ఉండాలన్నారు. పోలీసు శాఖలో చేరాలని నేటి యువత కలలు కంటుంటారని, ఆ కలను వారు సాకారం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు.. పోలీసు ఉద్యోగాలకు చాలా తేడా ఉంటుందని, పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నందుకు గర్వపడాలన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ.. అభ్యర్థులకు 9 నెలల శిక్షణ ఉంటుందని, అన్ని అంశాల్లో ఉత్తమ శిక్షణ అందిస్తామన్నారు. 30 సంవత్సరాల పాటు చేసే ఉద్యోగానికి సరిపడా శిక్షణ.. తొమ్మిది నెలల కాలంలో అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీటీసీ డీఎస్పీలు పిచ్చయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, మధన్మోహన్. ఇన్స్పెక్టర్లు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీశైలం ఇతర అధికారులు పాల్గొన్నారు.