GHMC | సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పనుల్లో ఏ మేర నాణ్యత ఉందో నిగ్గు తేల్చేందుకు ఏజెన్సీలతో తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు థర్డ్ పార్టీలుగా ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ( ఆర్ అండ్ డీ) సంస్థల నుంచి తాజాగా జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. సీఆర్ఎంపీ, ఎస్ఎన్డీపీ, హౌసింగ్, పీఎంసీ పనులు మినహా సివిల్ ఇంజినీరింగ్ పనులను ఎంపికయ్యే ఏజెన్సీలు తనిఖీలు చేయనున్నాయి.
పనులను నిర్ణీత వ్యవధిలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. సిమెంట్, కాంక్రీట్ ఫుట్‌పాత్‌లు, బీటీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, వరద నీటి డ్రైయిన్లు, ఆర్సీసీ భవనాలు, కల్వర్టులు, బ్రిడ్జిలు తదితర పనులను పర్యవేక్షించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం పనులను 12 ఏజెన్సీలుగా థర్డ్‌పార్టీ నిపుణులు ఎంపిక చేస్తారు. 30 సర్కిళ్లను 12 విభాగాలుగా చేసి.. ఒక్కో ఏజెన్సీకి ఒక్కో విభాగం బాధ్యతలు అప్పగిస్తారు. పది కిలోమీటర్ల పరిధిలోని ఇంజినీరింగ్ సంస్థల నిపుణులే ఏజెన్సీలుగా టెండర్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ గుర్తింపు కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వ యూనివర్సిటీల్లో సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌కు అనుబంధంగా ఉండాలి.