సిటీబ్యూరో: తమకు ఇండ్లు కేటాయించాలంటూ నగరవాసులు కలెక్టర్‌కు మొరపెట్టుకుంటున్నారు. గృహ నిర్మాణ శాఖకు ఇండ్ల కోసం దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండ్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారింది. హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ అవి ఖరీదైన స్థలాలు కావడంతో కొత్తగా ఇండ్లు నిర్మించడం అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండ్లు నిర్మించి ఉన్న, పనులు ఆగిపోయి ఉన్న వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా గురువారం గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఆసిఫ్‌నగర్ మండలంలోని బోజగుట్టలో ఆగిపోయిన డబుల్ బెడ్రూం ఇండ్లను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పరిశీలించారు. వివేకనంద నగర్, శ్రీరాం నగర్, శివాజీ నగర్ కాలనీవాసుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బోజగుట్టలో నివసిస్తున్న 500 మంది ప్రజలు తమ ఇండ్లు ఖాళీ చేశారని.. మిగిలిన 200 మంది ఇంకా ఖాళీ చేయలేదని కొందరు కోర్టుకు వెళ్లారని ఆయన తెలిపారు.
16వేల ఇండ్లు కేటాయించాం..
కొల్లూరులో 16వేల ఇండ్లు కేటాయించామని.. అందులో 6వేల కుటుంబాలు నివసిస్తున్నాయని గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ వివరించారు. బోజగుట్టలో ఆగిపోయిన డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. బోజగుట్ట డబుల్ బెడ్రూం ఇండ్ల ఇండ్ల నిర్మా ణం పూర్తి చేసి అందిస్తామన్నారు. డీఆర్ఓ వెంకటచారి, ఆర్డీఓ రామకృష్ణ, ఎమ్మార్వో జ్యోతి పాల్గొన్నారు.