మీ ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంత లేదా..? అయితే వెంటనే ఏర్పాటు చేసుకోండి.. లేదంటే.. వచ్చే ఏడాది నుంచి నీళ్ల ట్యాంకర్ బుక్ చేసే వారిని నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తామంటోంది జలమండలి. భూగర్భ జలాలను పెంపొందించడంలో భాగంగా ప్రతి నల్లా వినియోగదారుడి ఇంటి ప్రాంగణాల్లో ఇంకుడుగుంతను తప్పనిసరి చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగానే క్యాన్ నంబర్ల ఆధారంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది.
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత’ పేరిట తనిఖీలు చేస్తూ.. 300 చదరపు మీటర్లు, అంతకంటే ఎకువ విస్తీర్ణంలో ఉన్న బహుళ గృహ సముదాయాలతో పాటు వ్యక్తిగత గృహాల డేటా సేకరించి.. ఆ వివరాలను ప్రత్యేక యాప్‌లో పొందుపర్చనున్నది. ఈ ఏడాది చివరి వరకు ఈ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఆ తర్వాత తమ ఇంటి ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు నిర్మించకుండా ఉన్న యజమానులపై జలమండలి ప్రతాపం చూపనున్నది. వచ్చే ఏడాది 2025 జనవరి నుంచి వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకునే వినియోగదారుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేయనున్నది.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి చేస్తూ జలమండలి నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటా భూగర్భజలాలను రీస్టోర్ చేసుకునే దిశగా ఇప్పటికే నల్లా కనెక్షన్ ఉన్న వారితో పాటు కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వారి ఇంటి ప్రాంగణాల్లో ఇంకుడుగుంత ఉండేలా చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే వచ్చే నెల 2వ తేదీ మహాత్మగాంధీ జయంతి రోజున ‘ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత’ పేరుతో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఇంకుడు గుంత నిర్మించుకోవడానికి అర్హత కలిగిన జియాలజిస్టులతో అవసరమైన సాంకేతిక సహకారాన్ని జలమండలి అందించనున్నది. కేవలం వినియోగదారుల ప్రాంగణాల్లో గల బోర్లలో భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలను తప్పనిసరి చేస్తూ..జలమండలి నిర్ణయం తీసుకుంది. ఇంకుడు గుంతల సర్వే నివేదికల ప్రకారం ప్రత్యేక యాప్‌లో పొందుపర్చిన డేటా ఆధారంగా డివిజన్ స్థాయి అధికారులు తమ పరిధిలోని వినియోగదారులకు అడ్వయిజరీ లేఖలు జారీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వనున్నది. ఇండ్లలోఇంకుడు గుంతలు నిర్మించడం, ఒకవేళ పాడైతే వాటికి రిపేర్ చేయడం, వాటిని మెయింటెన్ చేయాలని లేఖల్లో సూచనలు ఇవ్వనున్నది. ఒకవేళ వినియోగదారులు పైన పేరొన్న సూచనలను పాటించడంలో విఫలమైతే.. వచ్చే ఏడాది నుంచి ట్యాంకర్ల బుకింగ్ సందర్భంగా రెట్టింపు చార్జీల భారం పడే అవకాశాలు ఉన్నాయి.
జలమండలి ఝలక్ నిబంధనల ప్రకారం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే ఆ ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి. నల్లా కనెక్షన్‌కు సంబంధించిన పర్మిషన్ లెటర్లో సైతం ఇంకుడు గుంత ఏర్పాటు షరతు ఉండనున్నది. నిర్మాణ సమయంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నా..కాలక్రమేణా దాన్ని పునరుద్ధరించుకోవడంలో ఆసక్తి చూపకపోవడం, మరికొందరు అసలు ఇంకుడు గుంతలు నిర్మాణమే చేపట్టకుండానే ఇండ్లు నిర్మించుకున్నట్లు జలమండలి గుర్తించింది. దీంతో ఇప్పటికే క్యాన్ నంబర్ల ఆధారంగా ఇంకుడు గుంతల స్థితిగతులపై సర్వే చేపట్టింది.
ఈ ఏడాది 14 జూన్ నుంచి సర్వే నిర్వహించగా, మొదటి విడతలో సుమారు 42,784 గృహ సముదాయాల ప్రాంగణాలు తనిఖీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 18 నాటికి 25,578 ప్రాంగణాలు పరిశీలించగా, వాటిలో 12,446 ప్రాంగణాలు ఇంకుడు గుంతలు కలిగి ఉండగా, మిగిలిన 13,132 వాటిల్లో లేవని గుర్తించి స్పెషల్ డ్రైవ్ ముమ్మరం చేసేందుకు జలమండలి సిద్ధమైంది. ఇక డివిజన్‌ను ఒక యూనిట్‌గా పరిగణించి తనిఖీలు ముమ్మరం చేయనున్నది. 300 చదరపు మీటర్లు, అంతకంటే ఎకువ విస్తీర్ణంలో ఉన్న బహుళ గృహ సముదాయాలతోపాటు వ్యక్తిగత గృహాల డేటా సేకరించి.. ప్రత్యేక యాప్‌లో పొందుపర్చనున్నది.