Jalamandali | సిటీబ్యూరో, అక్టోబరు 3(నమస్తే తెలంగాణ): సీవరేజి ఓవర్ ఫ్లోపై జల మండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌పై అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ ఫేజ్ 15, కైత్లాపూర్ తదితర ప్రాంతాలలో అధికారులతో కలిసి అశోక్ రెడ్డి గురువారం పర్యటించారు. మొదటగా హౌజింగ్ బోర్డు ప్రాంతానికి ఎండీ వెళ్లి అక్కడి సీవరేజ్ డీసిల్టింగ్ పనులను పరిశీలించారు.
జీహెచ్ఎంసీ సీవరేజ్ నిర్వహణను జల మండలికి అప్పగించిన సమయంలో మ్యాన్‌హోళ్లు రోడ్డుకు సమాంతరంగా నిర్మించే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకుండా కేవలం సిమెంట్ ఇటుకలతో వాటి ఎత్తును పెంచి ప్లాస్టరింగ్ పనులు పూర్తి చేయలేదని గుర్తించారు. 20 రోజులకోసారి వస్తున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఈ సందర్భంగా ఎండీ ఆదేశించారు.
ధ్వంసమైన మ్యాన్‌హోళ్లను గుర్తించి, వాటి స్థానంలో వెంటనే కొత్త వాటిని నిర్మించాలలని సూచించారు. హౌజింగ్ బోర్డు కాలనీలో బ్లాకులను గుర్తించి, ఆరు ప్లాట్లకు ఒక కమ్యూనిటీ సిల్ట్ ఛాంబర్‌ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడ సిల్ట్ కార్డింగ్ వాహనాల కార్మికులతో ఎండీ మాట్లాడారు. పనిచేస్తున్న సమయంలో రక్షణ పరికరాలు ఉపయోగించాలన్నారు. అనంతరం, కైత్లాపూర్కు ఎండీ వెళ్లి రహదారులపై పొంగిపొర్లుతున్న మురుగునీటి సమస్యపై స్థానిక కార్పొరేటర్ విన్నవించగా.., ఔట్లెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు.
ఆ తర్వాత స్థానిక డబుల్ బెడ్రూం కమ్యూనిటీ ప్రాంగణంలో పర్యటించారు. అక్కడ అపరిశుభ్రంగా ఉన్న సంపును పరిశీలించి సంపు వినియోగానికి వీలుగా సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ, హౌజింగ్ అధికారులకు సూచించారు. తాము నీటి సరఫరా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ప్రతి డివిజన్లో దీర్ఘకాలికంగా, తరచు వచ్చే సీవరేజి ఫిర్యాదులను శాశ్వతంగా పరిష్కరించడానికి అంచనాలు రూపొందించాలని సూచించారు. ఈ 90 రోజులు శక్తి వంచన లేకుండా పనిచేస్తే అద్భుత ఫలితాలు రాబట్టవచ్చని ఎండీ ఆశాభావం వ్యక్తం చేశారు.