Minister Ponnam Prabhakar | సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): వర్షపు నీటిని వృథా చేయవద్దని, ప్రతి నీటి చుక్కను భూగర్భ జలంగా మార్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గ్రేటర్లో సీవరేజీ ఓవర్‌ఫ్లో నివారణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌ను బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మెహిదీపట్నంలోని బాపూఘాట్ వద్ద గాంధీకి నివాళులర్పించిన అనంతరం స్పెషల్ డ్రైవ్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు.
అంతకు ముందు సరోజినీదేవి ఆసుపత్రి ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి ప్రాంగణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, భవిష్యత్‌లో నీటి కరువు రాకుండా ఖాళీ ప్రదేశాల్లో వీటిని నిర్మించుకోవాలని సూచించారు. నగరంలో ఉన్న మ్యాన్‌హోళ్లలో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగకుండా వాటిల్లో ఎలాంటి వ్యర్థాలు వేయొద్దని కోరారు.
నగరాన్ని సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి వివరించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ స్పెషల్ డ్రైవ్ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జలమండలి ఈడీ మాయంక్ మిట్టల్, డైరెక్టర్లు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.