HMDA | సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ పర్యవేక్షణలో ఉన్న పార్కుల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లల కోసం ఆట స్థలాల ఆధునీకరణ, బ్యుటిఫికేషన్ పనులను చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సరూర్‌నగర్‌లోని ప్రియదర్శిని పార్కులో ప్రవేశ మార్గంలో రెయిలింగ్‌తో పాటు, వాకింగ్ ట్రాక్, మరుగుదొడ్లకు మరమ్మతులతో పాటు ఓపెన్ జిమ్ పరికరాలు, ఎస్బీఆర్ ఫ్లోరింగ్‌తో ఆధునీకరించనున్నారు.
పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయనున్నారు. నారాయణగూడలోని డా. జీఎస్ మేల్కోటీ పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలను ఏర్పాటు చేయనుండగా, పాత్ వే, స్కేటింగ్ ఏరియా ఫ్లోరింగ్, పార్కింగ్, సీటింగ్ ప్రాంతాలకు వెళ్లేందుకు అదనపు గేట్లను అమర్చనున్నారు. దాదాపు కోటి అంచనా వ్యయంతో పార్కుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు హెచ్ఎండీఏ వర్గాలు వెల్లడించాయి.