సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఇన్ఫెక్షన్స్ను నియంత్రించడంపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతి దవాఖానలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో మైక్రోబయాలజీ విభాగానికి చెందిన వైద్యులు, సర్జన్లు, థియేటర్ అసిస్టెంట్స్, మైక్రోబయాలజీ, ఐసీయూ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీమ్‌లో ఉన్న సభ్యులందరికీ ఇప్పటికే నిమ్స్ దవాఖానలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గతంలో నెలకు ఒకసారి మాత్రమే ప్రభుత్వ దవాఖానల్లో ఇన్ఫెక్షన్స్కు సంబంధించిన స్వాబ్స్ తీసేవారు. తాజాగా తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఇప్పుడు వారానికి ఒకసారి ఇన్ఫెక్షన్కు సంబంధించిన స్వాబ్ తీస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
హాస్పిటల్ సామర్థ్యం ఆధారంగా టీమ్‌లు
హాస్పిటల్ కెపాసిటీ ఆధారంగా ఆయా దవాఖానల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఉస్మానియాలో 2, గాంధీలో 2, ఎంఎన్జెలో 1, నిలోఫర్‌లో 1, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖాన, సుల్తాన్‌బజార్, కోఠి ఈఎన్టీ, ఎర్రగడ్డ ఛాతి దవాఖానల్లో ఒకటి చొప్పున ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిని సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంఒలు ప్రతి వారం సమీక్షిస్తారు. ప్రతి రోజు దవాఖానలోని అన్ని చోట్ల శాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రధానంగా ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ వార్డులు, జనరల్ వార్డులు, ల్యాబ్స్, బ్లడ్ బ్యాంక్‌లలో ఖచ్చితంగా ఈ ఇన్ఫెక్షన్కు సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించి ఏమేరకు ఇన్ఫెక్షన్ ఉందో పరిశీలిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ విధంగా సేకరించిన నమూనాలను వారానికోసారి ల్యాబ్‌కు పంపుతున్నట్లు అధికారులు వివరించారు.
ప్రతి రోజు క్యూ.ఏ.
ప్రతి రోజు థియేటర్లలో క్వాలిటీ అష్యురెన్స్(క్యు.ఏ.) పరీక్షలు జరుపుతున్నట్లు దవాఖానల అధిపతులు చెబుతున్నారు. ఈ క్యు.ఎ పరీక్షలో ఏమైనా బ్యాక్టీరియా ఉందా అనే విషయాన్ని తెలుసుకుంటారు. శాంపిల్స్ టెస్ట్‌లో పాజిటివ్ ఫలితాలు వస్తే ఆ థియేటర్లు లేదా వార్డులు లేదా ల్యాబ్స్‌ను రెండు మూడు రోజుల పాటు మూసివేసి, అందులోని బ్యాక్టీరియాను నశింపచేసేందుకు రసాయనాలతో ఫ్యుమిగేషన్ చేస్తారు. థియేటర్లను స్టెరలైజ్ చేయడంతో పాటు క్లినికల్ ఇనిస్ట్రుమెంట్స్ను ఆటోక్లేవ్ చేస్తారు.
ఇన్ఫెక్షన్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ప్రతి రోజు థియేటర్లు, ఐసీయూ వార్డులను ప్రత్యేక రసాయనాలతో క్యుమిగేషన్ చేస్తారు. వీటితో పాటు దవాఖానలోని అన్ని వార్డులు, ల్యాబ్స్, ఇతర పరిసరాలను శుభ్రపరుస్తారు. ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఎప్పటికప్పుడు థియేటర్లను స్టెరిలైజ్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. అన్ని థియేటర్లలో ఎయిర్ రిఫ్రెషర్స్ను ఏర్పాటు చేశారు. దీని వల్ల థియేటర్లలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తుంటుంది.