Hyderabad | కవాడిగూడ, మార్చి 17 : అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి తగులబెట్టారు. దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి క్లూస్‌టీంను పిలిపించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు.
అప్పుడే పుట్టిన ఆడ శిశువుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బతికుండగానే పసికందును కాల్చేసారా..? మృతిచెందిన పసికందు ఆధారాలు లేకుండా చేసేందుకు ఇక్కడికి తీసుకువచ్చి తగులబెట్టారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఎవరు చేసారు.? ఎందుకు చేసారు..? అనే విషయాలను సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.