మేడ్చల్, ఏప్రిల్19(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తాత్సారం జరుగుతున్నది. మేడ్చల్ జిల్లాలో 308 మందిని మాత్రమే ఇప్పటి వరకు ఎంపిక చేశారు. అయితే శుక్రవారం నుంచి 21 వరకు ఇందిరమ్మ ఇంటి పథకానికి మరో విడతగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎంపీడీవోలకు బాధ్యతలను అప్పగించారు. ఇందిరమ్మ కమిటీలతో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక జాబితాను సిద్ధం చేయనున్నారు.ఈ జాబితాను ఈ నెల 22 నుంచి 28 వరకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ నెల 18 నుంచి 21 వరకు ఎంపీడీవోలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించి.. ఇందిరమ్మ ఇంటి పథకానికి ఎంపిక జాబితాను రెడీ చేస్తారు.
అయితే ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులను ఎంపిక చేస్తారా లేక వారు అనుకున్న వారిని ఎంపిక చేస్తారా అనే సందేహాలను దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇంటి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై దరఖాస్తుల పరిశీలన ప్రారంభించలేదు. ఇక లబ్ధిదారులను ఎంపిక ఎప్పుడు చేస్తారని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు.