సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : నిరుపేదల ఆకలి తీర్చాలనే ఉన్నత లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో సాగుతున్న ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’ (గతంలో అన్నపూర్ణ) ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారాయి. ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం కదా అనే నిర్లక్ష్యపు ధోరణి నిర్వాహకుల్లో కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో అడుగడుగునా నిర్వహణా లోపాలు, అధికారుల అశ్రద్ధ వల్ల ఐదు రూపాయల భోజనం, టిఫిన్స్ పథకం నీరుగారుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని క్యాంటీన్ల పనితీరుపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 30 వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 150 క్యాంటీన్లలో నిర్వహించిన సమగ్ర సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ.. నాణ్యతపై ఏది?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నపూర్ణ క్యాంటీన్లుగా ఉన్న వీటిని ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చి, డబ్బాల స్థానంలో రూ.11.43 కోట్లతో అత్యాధునిక కంటెయినర్లను ఏర్పాటు చేసినా, లోపల పరిస్థితి మాత్రం మారలేదు. కోట్లాది రూపాయల ప్రజాధనం సబ్సిడీ రూపంలో వెచ్చిస్తున్నా, తినే ఆహారంలో కనీస రుచి, పౌష్టిక విలువలు కరువయ్యాయని సర్వే వెల్లడించింది. సుమారు 70 శాతం మంది వినియోగదారులు ఆహారం అస్సలు రుచిగా ఉండటం లేదని తేల్చి చెప్పారు. అన్నం ముద్దగా ఉండటం, కూరలు నీళ్లలా ఉండటంతో పేదలు అర్థాకలితోనే వెనుదిరుగుతున్నారని పేర్కొన్నది.
అడ్రస్ లేని పారిశుధ్యం
క్యాంటీన్ల పరిసరాల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతున్నది. కంటెయినర్లలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు, ఫ్యాన్లు, లైట్లు షోకేసు ముకల్లాగే మిగిలిపోయాయి. తాగడానికి నీళ్లు లేక, చేతులు కడుకోవడానికి వసతి లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 79 శాతం మంది నీటి సౌకర్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డస్ట్ బిన్లు లేక విస్తర్లు రోడ్ల మీద పడేస్తుండటంతో క్యాంటీన్లే రోగాలకు నిలయాలుగా మారుతున్నాయని సర్వే ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పకనే చెత్త డంప్‌లు, మూత్రశాలలు ఉండటంతో తినేవారు ముకు మూసుకోవాల్సి వస్తున్నదని అంటున్నారు. ఉదయం 7 గంటలకు అందాల్సిన టిఫిన్, మధ్యాహ్నం 12 గంటలకు అందాల్సిన భోజనం వేళాపాళా లేకుండా సరఫరా అవుతున్నాయి.
ఇడ్లీలు రాళ్లలా ఉంటున్నాయని, చారు నీళ్ల లా ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు. పథకం అమలుపై అధికారుల నిఘా పూర్తిగా కరువైంది.సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందే ఉన్న క్యాంటీన్లను ఒక అధికారి కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవని 95 శాతం మంది పేరొనడం గమనార్హం. ఇంత భారీగా ప్రజాధనం ఖర్చు చేస్తున్నా, నాణ్యతలో మాత్రం రాజీ పడుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని క్యాంటీన్లతో పోలిస్తే ఇకడి పరిస్థితి దారుణంగా ఉందని స్వయంగా వినియోగదారులే అభిప్రాయపడుతున్నారు. అసలు నాణ్యత ఉండటంలేదని అంటున్నారు.
పీపుల్స్ పల్స్ సిఫార్స్‌లు ఇవే..
ఈ పథకం ఉన్నత లక్ష్యం నీరుగారిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్.దిలీప్ రెడ్డి సూచించారు. పథకం నిర్వహణకు ఒక స్పష్టమైన పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించాలని చెప్పారు. ఆహార నాణ్యతను ఎన్ఐఎన్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా పెంచాలని, నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలన్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ప్రభుత్వం ఈ పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆకలితో అలమటించే నిరుపేదలకు అండగా ఉండాల్సిన ఈ పథకం కేవలం ఆర్భాటాలకే పరిమితం కాకుండా, చిత్తశుద్ధితో అమలు చేయాలని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ దిలీప్ రెడ్డి పేరొన్నారు.