సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఇందిరా పార్కును ఎవరైనా సందర్శించవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు గురువారం స్పష్టం చేశారు. పార్కులో అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని భావించి ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే పెండ్లికాని జంటలకు ప్రవేశం లేదని క్షేత్రస్థాయిలోని ఓ అధికారి బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు వల్ల గురువారం పెద్ద దుమారం చెలరేగింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్పందించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఇందిరా పార్కులో కొంతకాలంగా ప్రేమికుల చేష్టలు శ్రుతిమించుతున్నాయని వాకర్స్ ఫిర్యాదు చేయడంతో హార్టికల్చర్ డీడీ… పెండ్లికాని వారికి ప్రవేశం లేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తూ ఇందిరా పార్కులోకి రావొచ్చని స్పష్టం చేశారు. బోర్డును తొలగించి.. మెమో జారీ చేశారు.