ఉప్పల్, జూలై 19: నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో పెట్రోల్ మాఫియా కొనసాగుతోంది. పెట్రోల్ ట్యాంకర్ల నుంచి ఇతర వాహనాలకు పెట్రోల్, డీజిల్ నింపి అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే సదరు పెట్రోల్ ట్యాంకర్‌పై బల్దియా స్టిక్కర్ ఉండటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంతంలోని ప్రసాద్ హాస్పిటల్ ప్రాంతంలో జిహెచ్ఎంసి స్టిక్కర్‌తో కూడిన డీజిల్ ట్యాంకర్‌ను ఉంచి పాఠశాల బస్సులకు పెట్రోల్ అందిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉప్పల్ సివిల్ సప్లై అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టగా నిందితులు పరారయ్యారని తెలిసింది. అధికారులు నామమాత్రంగా ట్యాంకర్‌ను సీజ్ చేశారు.
ఏళ్లుగా సాగుతున్న దందా..!
పెట్రోల్ దందా ఇక్కడ కొన్నేళ్లుగా సాగుతున్నట్లు సమాచారం. ప్రతిరోజు నాచారం ప్రసాద్ హాస్పిటల్ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్‌ను నిలుపుతారు. ఆ ట్యాంకర్ నుంచి డీపీఎస్‌కు చెందిన బస్సులకు పెట్రోల్ నింపుతారు. ఇలా పెట్రోల్ నింపే క్రమంలో ఓ వ్యక్తి దర్జాగా టేబుల్ వేసుకొని రిజిస్టర్ లో బస్సు నెంబర్లు, పోసిన డీజిల్ వివరాలు రాసుకుంటాడు. గత కొన్ని రోజులుగా విషయాన్ని గమనించిన స్థానికులు సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. శనివారం అధికారులు తనిఖీ చేపట్టి పెట్రోల్ ట్యాంకర్‌ను సీజ్ చేసి చేతులు దులుపుకున్నారు.
స్కూల్ బస్సులను ఎందుకు సీజ్ చేయలేదు?
కేవలం పెట్రోల్ ట్యాంకర్‌ను సీజ్ చేసిన అధికారులు అక్రమంగా పెట్రోలు నింపుకుంటున్న పాఠశాల బస్సులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో పెద్దల హస్తం ఉండటంతోనే పాఠశాలల బస్సుల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయా అధికారులకు చేరినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ పాఠశాల బస్సులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాహనాల సీజ్ చేయడంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. అయితే పెట్రోల్ ట్యాంకర్ వాహనంపై జీహెచ్ఎంసీ స్టిక్కర్ ఉండటం గమనార్హం. ఎవరిపైనా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని తెలుస్తుంది. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ట్యాంకర్‌ను సీజ్ చేశాం
మేము ఘటనా స్థలానికి వెళ్లిన సమయంలో అందరూ పరారయ్యారు. కేవలం ట్యాంకర్ మాత్రమే ఉంది. డ్రైవర్ కూడా దొరకలేదు. దీంతె పెట్రోల్ ట్యాంకర్‌ను సీజ్ చేశాం. ప్రస్తుతం ట్యాంకర్ మా అధీనంలోనే ఉంది.
– సివిల్ సైప్లె ఏఎస్ఓ