సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జరుగుతున్న ప్రమాదాల్లో 80శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అని పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న మందుబాబులు.. వారి ప్రాణాల తో పాటు ఇతరుల ప్రాణాలను తోడేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎంత అవగాహన కల్పించినా, ఎన్నిసార్లు జరిమానాలు విధించినా.. చివరకు జైలు శిక్షలు కూడా విధించినా వాహనాలు నడిపే మందుబాబుల్లో మార్పు రాకపోవడం విచారకరం.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రతి రోజు కనీసం 5నుం చి 10 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా వాటిలో ప్రతిరోజు సగటున నలుగురు మృతిచెందుతున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ మందుబాబుల్లో మార్పురాకపోవడంతో ప్రమాదాలు కొనసాగుతున్నాయి.
రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో గతనెల రోజులుగా 4 వారాంతరాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో సుమారు 1500మంది పట్టుపడ్డారు. కేవలం నాలుగు శనివారాల్లో చేసిన తనిఖీల్లోనే ఇంతమంది పట్టుబడ్డారంటే ఇక ప్రతిరోజు పోలీసులకు దొరకకుండా ఎంతమంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులే ఉంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఒక నెలలో నమోదైన కేసులను పరిశీలిస్తే … మే 24న జరిగిన తనిఖీల్లో 252మంది వాహనదారులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడగా అందులో 199మంది ద్విచక్రవాహనదారులే ఉన్నా రు. మే 17న జరిగిన తనిఖీల్లో పట్టుబడిన 306 మందిలో 346 మంది ద్విచక్రవాహనదారులే ఉన్నారు. మే 10న జరిగిన తనిఖీల్లో పట్టుబడిన 238మందిలో 189మంది ద్విచక్రవాహనదారులు ఉన్నారు. మే 3న జరిగిన తనిఖీల్లో 238మంది పట్టుబడితే 187మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, మే 30న జరిగిన తనిఖీల్లో 305మంది మందుబాబులు పట్టుబడగా వారిలో 242మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
మద్యం మత్తులో వాహనాలు నడిపినవారికే కాకుండా ఇతరులకు కూడా ప్రాణపాయమని, మద్యం సేవించేందుకు బయటకు వచ్చినవారు డ్రైవింగ్ కోసం మద్యం సేవించనివారిని తోడుగా తీసుకెళ్లాలని లేదా క్యాబ్, రాపిడో వంటి వాహనాలను ఆశ్రయించి క్షేమంగా ఇళ్లకు చేరాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూ చిస్తున్నారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలకు మద్యంమత్తే కారణమని పోలీసులు చెబుతున్నా రు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృ ష్టి సారించామని ఇందులో భాగంగానే వారాంతరాలతో పాటు సాధారణ రోజు ల్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.