సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ చర్యలు చేపట్టినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటున్నది. తరచూ సరఫరాలో అంతరాయం షరా మామూలే అన్నట్లుగా మారింది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) నుంచి ఇంటికి వెళ్లే లైన్లపై వేసవి కాలంలో లోడ్ గణనీయంగా పెరుగుతున్నది. దీనివల్ల డీటీఆర్ వద్ద ఉండే ఫ్యూజ్ బాక్సులో పవర్ ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతోంది. శనివారం సాయంత్రం హిమాయత్‌నగర్‌లో ఉన్న సీపీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 15 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది.
స్పందించిన సిబ్బంది వెంటనే సరఫరాను పునరుద్ధరించారు. ఇలా నగరంలో ఒక్క చోటే కాదు… తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం 5,10,15 నిమిషాల పాటు ఉంటున్నది. ఒక విద్యుత్ కార్యాలయం సెక్షన్ పరిధిలో 20-30వేల కనెక్షన్లు ఉంటే, వాటికి కరెంటు సరఫరా చేసేందుకు సబ్ స్టేషన్ నుంచి వచ్చే ఫీడర్ల పరిధిలో పదుల సంఖ్యలో డీటీఆర్లు ఉంటాయి. ఇలా పదుల సంఖ్యలో ఉన్న డీటీఆర్లపై వేసవిలో తరచూ లోడ్ పెరగడం వల్ల ఒకే సమయంలో పలు చోట్ల తలెత్తే అంతరాయాలను పునరుద్ధరించేంత సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండటం లేదు.
డీటీఆర్ వద్దకు వెళ్లి ఫ్యూజ్ బాక్సులో సమస్యను పరిష్కరించాలంటే 5-10 నిమిషాల సమయం పడుతున్నది. క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఫ్యూజ్ ఆఫ్ కాల్ సిబ్బంది తక్కువ ఉండడంతో ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లి మరమ్మతులు చేయడానికి కొంత సమయం పడుతోంది. ఇలా ప్రతి రోజూ ట్రాన్స్ఫార్మర్ల పరిధిలోనే ఎక్కువ అంతరాయాలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇది స్వల్ప కాలం అంతరాయం తప్ప, విద్యుత్ కోతలు కావని, సరఫరా నిలిచిపోయిన చోటుకు సిబ్బంది వెళ్లి సరి చేసేందుకు కొంత సమయం పడుతోందని చెబుతున్నారు.