సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ చుట్టూ(GHMC) ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై( ORR) టోల్ చార్జీలను(Toll charges) పెంచడాన్ని అధికారులు వాయిదా వేశారు. ప్రతియేటా ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్ 1 నుంచే టోల్ చార్జీలను పెంచుతారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 1కి ముందే పార్లమెంటు ఎన్నికలు(Elections) జరుగుతుండడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఉండవద్దనే ఉద్దేశంతో టోల్ చార్జీల పెంపు నిర్ణయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులు పెండింగ్లో ఉంచారు.
పెంపునకు సంబంధించిన టోల్ చార్జీల వసూలు కోసం ఓఆర్ఆర్ టోల్ నిర్వహణ సంస్థ ఐఆర్బీ అన్ని ఇంటర్చేంజ్ల వద్ద బోర్డులు, పోస్టర్లులు ఏర్పాటు చేసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో టోల్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి పాత రేట్లతోనే టోల్ వసూలు చేయాలని అధికారులు సూచించారని టోల్ నిర్వాహకులు తెలిపారు. కాగా, మే 13న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి టోల్ చార్జీలు పెంచే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.