ఖైరతాబాద్, మార్చి 27: బంగారం షోరూమ్‌కు కస్టమర్లుగా వచ్చి చాకచక్యంగా ఆభరణాలను తస్కరించిన ఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌లో ఈనెల 20వ తేదీన పలువురు మహిళలు వచ్చారు. బంగారు గాజులను చూపించాలని సేల్స్‌మెన్‌ను కోరారు. కొన్ని గాజుల తెచ్చి వారి ముందు ఉంచారు. దీంతో మరిన్ని ఆభరణాలు చూపించాలని కోరగా, సేల్స్‌మెన్ ఆ పనిలో ఉన్నాడు.
అదే అదునుగా భావించిన ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న డూప్లికేట్ గాజులను పెట్టి ఒరిజినల్‌ను తస్కరించారు. కొద్ది సేపటికి ఎలాంటి కొనుగోలు చేయకుండానే వెళ్లిపోయారు. ఇటీవల క్రాస్ చెకింగ్ సందర్భంగా డూప్లికేట్ గాజులను గుర్తించారు. వెంటనే సీసీ టీవీ పుటేజీలను పరిశీలించగా, 20వ తేదీన బంగారు గాజులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిలో ఓ మహిళ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. దొంగిలించిన బంగారం 54.89 గ్రాములు ఉంటుందని పోలీసులు తెలిపారు. షోరూమ్ హెడ్ జిజేష్ కేఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.