మేడ్చల్, ఫిబ్రవరి11(నమస్తే తెలంగాణ) : ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందజేస్తున్నది. పండ్ల తోటలు, కూరగాయల సాగు, పూల తోటల సాగు, పాలీహౌస్ ద్వారా పంటల సాగు, ఇతర ఉద్యానవన వాణిజ్య పంటలను సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంతో పాటు విత్తనాలు, మొక్కలను రాయితీలో అందజేస్తున్నది. పంటల సాగుపై అవగాహన పెంచడమే కాకుండా ప్రత్యేక పంటల సాగు, మార్కెట్లో పంట డిమాండ్ వంటి అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నది. సర్కారు అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు మరింత లాభపడాలని రాష్ట్ర ఉద్యాన వన శాఖ అధికారులు అన్ని వర్గాలను కోరుతున్నారు.
10,200 ఎకరాల్లో సాగు
మేడ్చల్ జిల్లాలోని అన్ని వర్గాల రైతులు ఉద్యానవన పంటలను సాగచేస్తున్నారు. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటంతో రైతులు ఉద్యానవన పంటలను సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పండ్ల తోటల పెంపకంతో పాటు కూరగాయలు, ఇతర వాణిజ్య ఉద్యానవన పంటల సాగు ప్రతియేటా పెరుగుతున్నది. జిల్లాలో 10,200 ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. ఉద్యానవన పంటల సాగులో రైతులను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీ పథకాలను ప్రవేశపెట్టింది.
పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం
పండ్ల తోటను సాగుచేసే రైతులకు ఉద్యానవన శాఖ అధ్వర్యంలో ప్రత్యేక రాయితీలను కల్పిస్తూ రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నది. పండ్ల తోటల విస్తరణ పథకంలో భాగంగా 40 శాతం రాయితీ ఇస్తున్నది. ఇందులో బొప్పాయి, మామిడి, జామ, అరటి, సీతాఫలం, అంజీర, డ్రాగన్ ఫ్రూట్, ఉసిరి, నేరేడు, తదితర పండ్ల తోటలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అదేవిధంగా క్యాప్సికం, వంకాయ, బెండకాయ, కాకరకాయ, టామాట, ఆకు కూరల పంటలకు కూడా రాయితీ ఇస్తున్నారు.
సాగు వద్దకే కొనుగోలు దారులు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పండించే పంటలకు మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో రైతులు ఉద్యానవన పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. రైతుల వద్దకే వచ్చి కూరగాయలు, పండ్లను కొనుగోలు చేస్తుండటంతో రైతులకు మార్కెటింగ్ ఖర్చు కలిసి వస్తుంది. అయితే జిల్లాలో 15 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు లక్ష్యంగా అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలు, 80శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలను అందించే విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఎకరాకు రూ.40వేలు
ఆరు ఎకరాల భూమిలో కూరగాయలు సాగు చేస్తున్న. ఎకరాకు ఖర్చులు పోను రూ.40వేలు మిగులుతున్నాయి. ఉద్యానవన శాఖ అధికారులు తగు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలానే ప్రోత్సహించాలి.
-కౌకుట్ల బాపురెడ్డి, మేడ్చల్
లాభ సాటిగా కూరగాయల సాగు
కూరగాయల సాగు లాభసాటిగా ఉంది. నగరానికి దగ్గరలో ఉన్నందున మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. రాయితీలను ఇప్పిస్తున్నారు.
-సింగిరెడ్డి భాగ్యమ్మ, బాబాగూడ