Uppal Sky Walk | సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ)/ ఉప్పల్ : ఉప్పల్ చౌరస్తాలో నిర్మిస్తున్న స్కైవాక్ నిర్మాణ పనులను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ పరిశీలించారు. మంగళవారం హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి, ఎస్ఈ యూసుఫ్ అలీ, ఈఈ అప్పారావుతో కలిసి ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం పనులను తనిఖీ చేశారు.
ఇన్నర్ రింగు రోడ్డు ఉప్పల్ చౌరస్తాలో తరచూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను, పాదచారులు రోడ్డు దాటేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు రూ.25 కోట్లతో చేపట్టిన ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 660 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న స్కైవాక్‌లో 9 లిప్టులు, 3 ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా పాదచారులు రోడ్డు దాటకుండా స్కైవాక్ ద్వారా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా మార్గాలను నిర్మించారు. అత్యాధునిక నిర్మాణ శైలిలో స్కైవాక్‌ను నిర్మిస్తున్నామని అర్వింద్‌కుమార్ తెలిపారు. అనంతరం ఎల్బీనగర్ జోన్ పరిధిలో హబ్సిగూడ నుంచి మూసీ బ్రిడ్జి ఎల్బీనగర్ వరకు జరుగుతున్న మోడల్ కారిడార్ పనులను పరిశీలించారు. ఉప్పల్ శిల్పారామం ప్రాంతంలో పనులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోంను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ , హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. భవిష్యత్తు తరాల కోసం ఇలాంటి కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, హెచ్ఎండీఏ, సాంఘిక సంక్షేమ శాఖలతో కలిసి పునరుద్ధరణ పనులు చేపడతామని అర్వింద్‌కుమార్ తెలిపారు. వీఎం హోంను పరిశీలించిన వారిలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌తో పాటు క్షేత్ర కన్జర్వేటివ్ ప్రతినిధి జీ.ఎస్.వి.సత్యనారాయణ మూర్తి, హెచ్ఎండీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ధన్సింగ్, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.