సిటీబ్యూరో, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (సెమీ) తన ప్రతిష్టాత్మక సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా మూడు రోజుల ‘ఎమర్జెన్సీ మెడిసిన్ కాన్ఫరెన్స్-2023’ని శుక్రవారం హెచ్ఐసీసీలోని నోవాటెల్‌లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా ముఖ్య అతిథిగా హాజరైన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో అత్యవసర వైద్యం పాత్ర చాలా కీలకమని అన్నారు. దేశ జనాభా సుమారు 140 కోట్లకు పైగా పెరిగిందని తెలిపారు. బిజీ లైఫ్, జీవన శైలి దృష్ట్యా చాలా మంది అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించడంపై అవగాహన కల్పిస్తున్న సెమీ సభ్యులను ఆయన ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి సరైన రోడ్ మ్యాప్‌కు ఈ సదస్సు మార్గం సుగమం చేస్తున్నదన్నారు. అనంతరం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ, అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుకునేలా సెమీ సభ్యులు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.
ఎమర్జెన్సీ అనేది జీవన్మరణానికి సంబంధించిన విషయమని వివరించారు. కాగా ఈ సదస్సు రేపటితో ముగియనుంది. ప్రపంచ దేశాల నుంచి సుమారు 1500 మంది వైద్య నిపుణులు సెమినార్ల వారీగా ఈ సదస్సుల్లో పాల్గొంటున్నారు. అత్యవసర వైద్యం సమయంలో తీసుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. కార్యక్రమంలో సెమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హరిప్రసాద్, సెమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శరవణ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.