శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28: లిఫ్ట్ అడిగిన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వారిలో ఓ విద్యార్థిని ఫోన్ లాక్కుని నలుగురు యువకులు పరారైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సెంట్రల్ యూనివర్సిటీ లో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న భూక్యా నవీన్ వర్సిటీలోని ఎల్ హాస్టల్లో ఉంటున్నాడు.
కూకట్‌పల్లిలోని ఓ కాలేజీలో బీకామ్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న బి.శరత్‌బాబు, ఘట్కేసర్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎ.నవీన్, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎ.చింటులు తమ స్నేహితుడైన భూక్యా నవీన్ ఉంటున్న హాస్టల్ వద్దకు సోమవారం రాత్రి వచ్చారు.
వర్సిటీలోని నిర్మానుష్య ప్రదేశంలో వారు పీకలదాకా మద్యం సేవించారు. అనంతరం శరత్‌బాబు తన ద్విచక్ర వాహనంపై క్యాంపస్‌లో ప్రయాణిస్తుండగా ఇద్దరు పీహెచ్డీ విద్యార్థినులు లిఫ్ట్ కావాలని అడిగి అతని వాహనం ఎక్కారు. సౌత్ క్యాంపస్ వైపు వాహనాన్ని మళ్లించిన శరత్‌బాబు అక్కడే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఆగి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
అతని చర్యకు భయపడ్డ విద్యార్థినులు పారిపోయేందుకు యత్నించగా వారిలో ఓ విద్యార్థిని చేతిలోని ఫోన్‌ను అతను లాక్కుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఘటనను విద్యార్థినులు తమ తోటి విద్యార్థులకు తెలియజేయగా వారు క్యాంపస్ అంతా గాలించి శరత్‌తోపాటు భూక్యా నవీన్, ఎ.నవీన్, చింటూలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు వారిపై దారి దోపిడీ, అసభ్య ప్రవర్తన కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు.