‘రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా వైట్ నెంబర్ ప్లేట్గల మారుతి, ఓమ్ని, మెటాడోర్ వ్యాన్లు విద్యార్థులను తరలించే వ్యాపారం చేయడం కుదరదు. అందులోను పిల్లల ప్రాణాలతో చెలగాటమాడేలా అదనపు సీట్లు బిగించి, ఎటువంటి కిటికీలు లేకుండా కుక్కి నరకం చూపిస్తున్నారు వ్యాన్ డ్రైవర్లు. ఈ పరిస్థితిపై ఓ రవాణా శాఖ అధికారి స్పందిస్తూ ఇటీవల అటువంటి ప్రమాదాలు ఏం జరగలేదు కదా’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అంటే ప్రమాదం జరిగితేనే చర్యలు తీసుకుంటామనే లెక్కన అధికారులు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రమాదాల నివారణ కోసమే కదా కేంద్ర మోటార్ వాహన చట్టం చేసుకున్నదనే విషయాన్ని మరిచిపోయి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడేలా వ్యాన్లకు నగరం నడిబొడ్డున చక్కర్లు కొట్టే అనుమతినిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది’.
సిటీబ్యూరో, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ) : వాహన నిబంధనలు తమకేం వర్తించవు అన్నట్టుగా నగరంలో వేలాది మారుతి వ్యాన్లు, మెటాడోర్ వ్యాన్లు రోడ్లపై యథేచ్ఛగా విద్యార్థులను ఎక్కించుకొని పరుగులు తీస్తున్నాయి. తమ పరిధిలోని రవాణా శాఖ అధికారులు మాత్రం అటు వైపునకు చూడటం లేదు. విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలు నిర్వహించే బస్సులకు మోటార్ వాహన చట్టంలో పలు నిబంధనలు చేశారు. వాటికి విరుద్ధంగా వ్యాన్లు ఎలాంటి అనుమతులు లేకున్నా, రక్షణ చర్యలు లేకుండా లక్షలాది మందిని విద్యా సంస్థలకు తరలిస్తున్నారు. వ్యాన్లలో భద్రత లేదని గ్రహించిన కొన్ని రాష్ర్టాలు వాటిని నిషేధించిన విషయంతెలిసిందే.
అలాంటి వ్యాన్లు మాత్రం ఇక్కడ యథేచ్ఛగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు సుమారు 20వేల వ్యాన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులను రవాణా సాగిస్తున్నాయి. కానీ వాటిలో 6 వేల మందికి పైగా లైసెన్స్ లేని డ్రైవర్లే ఉన్నారని తెలుస్తుంది. గ్రేటర్లో వేలాది మారుతి, ఓమ్ని వ్యాన్లు, మెటాడోర్ వ్యాన్లు ఆర్టీఏ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఐదు, ఎనిమిది, 16 సీట్ల వ్యాన్లలో 40 మందికి పైగా తరలిస్తున్నారు.
నిబంధనలకు పాతర..
విద్యార్థులను తరలించే ఎలాంటి వాహనమైనా కేంద్ర వాహన చట్టం ప్రకారం సంబంధిత విద్యాసంస్థ అనుమతి ఉండాలి. దాని ఆధారంగా రవాణా శాఖ నుంచి అనుమతి పొందాలి.ఆర్టీఏ నిబంధనల ప్రకారం విద్యా సంస్థ వాహనానికి ప్రత్యేకంగా పసుపు రంగు వేయాలి. స్కూల్ యాజమాన్యం, రవాణా శాఖ అనుమతి పొందిన తర్వాత ఆ విద్యా సంస్థ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, చిరునామా, ఫోన్ నెంబర్‌తో పూర్తి వివరాలు వ్యాన్‌పై కనిపించేలా రాయాలి. నిబంధనల ప్రకారం వ్యాన్ యజమానులు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం నిర్ణయించిన సీట్లకు ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఏడు సీట్లు దాటినా వాహనం నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. కానీ నగరంలో తిరుగుతున్న వ్యాన్లలో ఎన్ని సీట్లు బిగిస్తున్నా ఒక్క రూపాయి చెల్లించకుండానే యథేచ్ఛగా తిరుగుతున్నాయి.
కార్మిక నాయకులకు కాసుల పంట..
నగరంలో అనుమతులు లేకుండా తిరుగుతున్న వేలాది వ్యాన్ల వల్ల కార్మిక నాయకులకు కాసుల పంట పడుతుంది. ప్రతీ మూడు నెలలకోసారి పన్నులు చెల్లించడం, పర్మిట్, లైసెన్స్‌లు లేని డ్రైవర్, అదనపు సీట్ల బిగింపు నుంచి రవాణా అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి కొంతమంది కార్మిక నాయకులు వారి తరపున వకాల్తా పుచ్చుకొని కొందరు అధికారులతో రాయబారం నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్గంలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. గ్రూపులుగా ఏర్పాటై ప్రతి గ్రూప్‌నకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఎలాంటి అనుమతులు లేకున్నా వారిని ఏమనకుండా వ్యాన్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.